Fake Phonepe Fraud in Kurnool :మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీతోపాటే మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నమ్మకంగా మాట్లాడుతూ నట్టేట ముంచుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిన్నటివరకూ జరిగిన ఆన్‌లైన్ మోసాలు ఒక ఎత్తైతే, సరికొత్త పంథాలో యూపీఐ చెల్లింపులతో జరుగుతున్న దోపీడీలు మరో ఎత్తు.
అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. నెమ్మదిగా ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చేతిలో ఉన్న డబ్బంతా బెట్టింగ్‌లో పొగొట్టుకున్నాడు. ఇక ఏం చేయాలో తెలియక కొత్త పథకానికి తెరతీశాడు. ఏటీఎంల వద్ద ఉంటూ అక్కడికి వచ్చే వారిని గమనించేవాడు. వారి దగ్గరకి వెళ్లి తనకు డబ్బులు (క్యాష్) అవసరమని ఇస్తే ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తానని నమ్మించేవాడు. ఇది నమ్మిన బాధితులు అతడికి నగదు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే నిందితుడు ఫేక్ ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించినట్లు మేసేజ్ చూపించి అక్కడి నుంచి ఉడాయించేవాడు. ఆ తర్వాత బాధితులు తమ ఖాతాల్లోకి సొమ్ము రాకపోడంతో మోసపోయామని గ్రహించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాండ్రపాడు గ్రామానికి చెందిన కార్తీక్ పోస్టల్ శాఖలో ఉద్యోగి. ఆన్‌లైన్ వ్యసనాలకు అలవాటుపడి అతను డబ్బుల కోసం మోసాలకు తెరలేపాడు. కర్నూలులోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం వద్ద ఉండి అక్కడి వచ్చే వారిని డబ్బులు అవసరమని నమ్మంచేవాడు. అలా ఫోన్ పే ద్వారా వేస్తానని చెప్పి నకిలీ ఫోన్ పే ద్వారా పంపుతూ మోసం చేస్తున్నాడు. కొంతకాలం నుంచి కార్తీక్ ఇలా చేస్తున్నట్లు సమాచారం.