KTR with Farmers on Crop Damage in Sircilla :సాగు నీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించే తీరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పదేపదే దిల్లీకి వెళ్లడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రెండు లక్షల రుణాల మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఎండిపోయిన పొలాలను కేటీఆర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయో రైతులను అడిగి తెలుసుకున్నారు.
KTR about CM No time To inspect Crops : ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్న కేటీఆర్, రుణమాఫీని అమలు చేసి ఆ రైతుల కుటుంబాల్లో భరోసా కల్పించాలని సూచించారు. అంతేకాకుండా రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. ఎన్నికల సందర్భంగా రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చెరువులు నింపకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. వాటిని పరిశీలించి వెంటనే పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR inspects Crops in Sircilla Disrtict : గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని, లేదా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎకరానికి రూ.15 వేలు లేదా 20 వేల రూపాయలు అయినా చెల్లించాలని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇప్పటికే నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించడమే కాకుండా ఇప్పుడు కోతకు వస్తున్న పంటను కూడా కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్వింటా వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని, అవసరమైతే ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సూచించారు.