KTR Fires On CM Revanth Reddy: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టుపై మరోసారి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను కేటీఆర్ కలిశారు.
KTR Slams Revanth Over Krishank's Arrest :క్రిశాంక్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. క్రిశాంక్ చేసింది తప్పని నిరూపిస్తే తాను జైలుకు వెళ్తానని అన్నారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్, తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలని సవాల్ చేశారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని, ఇలా నిర్దోషులను కాదంటూ మండిపడ్డారు. క్రిశాంక్ జైల్లో నిబ్బరంగా ఉన్నారని త్వరలోనే విడుదలవుతారని కేటీఆర్ తెలిపారు.
ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు : కేటీఆర్‌తో పాటు క్రిశాంక్‌ను అతడి భార్య సుహాసిని కూడా జైల్లో కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె కూడా మీడియాతో మాట్లాడారు. తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని క్రిశాంక్ భార్య సుహాసిని ఆరోపించారు. ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఓయూ మెస్‌ల మూసివేతపై సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేశారన్న అభియోగంపై ఈ నెల 1వ తేదీన క్రిశాంక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.