KTR Reaction on MLA Kaushik Reddy Case : హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం పట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పన పైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా అని నిలదీశారు. ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారంటూ మండల విద్యాధికారులకు డీఈవో అక్రమంగా నోటీసులు ఇవ్వటమేంటని ప్రశ్నించారు.
'ప్రభుత్వాధికారి అయిన డీఈఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహారిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని జడ్పీ సమావేశంలో కౌశిక్ రెడ్డి లేవనెత్తారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించటానికి కూడా కౌశిక్ రెడ్డి కి హక్కు లేదా? దళిత బంధు చెక్కుల పంపిణీతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇవ్వడంతోపాటు మహిళల కోసం అదనంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ పోస్టింగ్ ఇవ్వాలని మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ అడిగారు. ఇది కూడా నేరమేనా?' అని కేటీఆర్ నిలదీశారు.