KTR Meets KCR in Erravalli Farmhouse : ఫార్ములా-ఈ రేసు కేసులో నిన్న(జనవరి 09న) ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. కొంత మంది ముఖ్యమైన పార్టీ నేతలతో కలిసి ఆయన ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. తండ్రితో కాసేపు విడిగా సమావేశమైన కేటీఆర్ విచారణకు సంబంధించిన అంశాలను ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు సహా అన్ని అంశాలను కేసీఆర్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లినట్లు సమాచారం. న్యాయపరంగా సహా ఇతరత్రా అంశాలపై అనుసరించాల్సిన విధానాలను తన కుమారుడుకి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
అన్నింటికీ సిద్ధంగా ఉండాలి : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నింటినీ సిద్దంగా ఉండాలని, ప్రజల కోసం అనునిత్యం పోరాడాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. కేసులు సహజమేనని ప్రస్తుత ముఖ్యమంత్రి కొంచెం ఎక్కువ చేస్తున్నారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకొందని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. నేతలందరూ సమస్యల ఆధారంగా ప్రజల్లో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం నిలదీయాలని దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. భేటీ అనంతరం కేటీఆర్ హైదరాబాద్ పయనమయ్యారు. మరోవైపు ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణ కోసం ఈనెల 16న కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది.