KTR Meet With Warangal Parliament Constituency Leaders :రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వరంగల్‌తో పాటు పెద్దపల్లి పార్లమెంట్(Peddapalli Parliament) నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ముఖ్యనేతలతో ఆయన హైదరాబాద్‌లో విడివిడిగా సమావేశమయ్యారు. వరంగల్ లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు.
కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని, ప్రజలు, తెలంగాణ సమాజం బీఆర్ఎస్ వెంటే ఉందని కేటీఆర్ వివరించారు. వరంగల్ నుంచి పార్టీ బరిలో దింపిన సుధీర్ కుమార్(Warangal MP Candidate Sudhir Kumar) అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న ఆయన, అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగిందని గుర్తు చేశారు. 2001 నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గెలుపే లక్ష్యంగా గులాబీ సత్తాచాటేలా : చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు గులాబీ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోనూ గులాబీ గెలుపు ఖాయమైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు(Koppula Eshwar) ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతారని పేర్కొన్నారు.