KTR On Rajiv Gandhi Statue : రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేంటని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ సమాజం మొత్తం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
అస్తిత్వాన్ని తాకట్టు పెట్టడమే : రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినందుకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని కోరారు.
తెలంగాణ తల్లి కోసం స్థలం ఎంపిక : రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సచివాలయం, అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కేసీఆర్ 2023 జులైలోనే స్థలాన్ని ఎంపిక చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.