Raj Pakala attended for Police Investigation End : జన్వాడ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇవాళ మోకిల పీఎస్‌లో విచారణ ముగిసింది. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద మోకిల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అలాగే రాజ్ పాకాల మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు.
విచారణ అనంతరం రాజ్ పాకాల మీడియాతో మాట్లాడారు. పోలీసుల విచారణకు సహకరించానని చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఫాంహౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీనని, విజయ్ మద్దూరి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. ఎవరికో డ్రగ్ పాజిటివ్ వస్తే నాకేంటి సంబంధమని రాజ్ పాకాల తెలిపారు. మా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది.. ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదానని ప్రశ్నించారు. కావాలనే ఇష్యూను పెద్దదిగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు.
అవసరం అయితే మళ్లీ విచారణకు పిలుస్తాం : అంతకు ముందు ఏసీపీ మాట్లాడుతూ, రాజ్ పాకాల విచారణ పూర్తి అయిందని ఏసీపీ రమణగౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తు దశలోనే ఉందన్నారు. అవసరమైతే మరోసారి ఆయనను విచారణకు పిలుస్తామని ఏసీపీ స్పష్టం చేశారు.
రాజ్‌పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో న్యాయవాదితోపాటు ఆయన విచారణకు వచ్చారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించి విషయాలపై విచారించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఫామ్‌హౌస్ యజమాని రాజ్ పాకాల శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలో భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. దీంతో డ్రగ్స్ టెస్టు నిర్వహించి పోలీసులు రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఈ మేరకు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు.
కోకైన్ ఎక్కడి నుంచి వచ్చిందన్నపై ఆరా :ఫామ్‌హౌస్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించిన సమయంలో అక్కడున్న సెల్‌ఫోన్‌ను ఓ మహిళ దాచి పెట్టింది. దానిని ఆదివారం రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే ఆ మొబైల్ ఫోన్లో ఉన్న డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొకైన్ మత్తుపదార్ధాలు తీసుకొచ్చి విజయ్ మద్దూరికి ఎవరు ఇచ్చారన్న దానిసైతం పోలీసలు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రాజ్ పాకాల ఈ నెల 28న కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ధర్మాసనం ఆ రోజే విచారణ చేపట్టింది.
రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని రాజ్ పాకాల తరఫున మయూర్‌రెడ్డి కోర్టుకు వివరించారు. పోలీసుల తరఫున ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. అరెస్టు చేస్తామని తాము చెప్పలేదని, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, నిబంధనల ప్రకారమే 41ఏ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఇరువైపు వాదనలు విన్నన్యాయస్థానం పోలీసులు ఎదుట హాజయ్యేందుకు పిటిషనర్‌కు రెండు రోజుల గడువు ఇచ్చింది.
జన్వాడ ఫామ్‌హౌజ్ కేసు - కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై పోలీసులు ఆరా!