Kodandaram on BRS Medigadda Tour : బీఆర్ఎస్ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పటిష్ఠంగా ఉందనటం విడ్డూరమని చెప్పారు. మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని భారత్ రాష్ట్ర సమితి వితండవాదం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం తప్పిదాలపై బహిరంగ చర్చకు గులాబీ పార్టీ సిద్ధమా? అని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మేడిగడ్డ ఘటనపై మార్చి 10వ తేదీన బీఆర్ఎస్ చర్చకు రావాలని కోదండరాం సవాల్ విసిరారు. ఊరూరా తిరిగి గులాబీ పార్టీ బండారం బట్టబయలు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం కామధేను ఎట్లా అయితుందో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు కామధేను కాదని, తెలంగాణ పాలిట గుదిబండని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) మూడు రకాల సంక్షోభానికి కారణమైందని తెలిపారు. సాగునీరు, ఇంజినీరు వ్యవస్థ, నిధుల సంక్షోభానికి గురైందని వివరించారు. ఫాంహౌజ్ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఆ ప్రాజెక్టు చేపట్టారని కోదండరాం ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆ విషయం గుర్తించలేకపోతున్నారు : కోదండరాం
Kodandaram Comments on KCR : ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చారని కోదండరాం ఆరోపించారు. డిజైన్లను కూడా తరచూ మార్చుకుంటూ పోయారని, ఇందుకు కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోలేదని తెలిపారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ (Medigadda Barrage Damage) సరైన ప్రదేశం కాదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న కోదండారం సీడబ్ల్యూసీ హెచ్చరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. పంప్‌హౌస్‌లు మునుగుతాయని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆక్షేపించారు.