No Diwali Celebrate in Kithampeta : దీపావళి పండుగ రోజున బంధుమిత్రులకు మిఠాయిలు పంచి, శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. రకరకాల పిండి వంటలు చేసుకోవడం, కొత్త వస్త్రాలు ధరించడం, సాయంత్రం దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం చేస్తాం. పిల్లలు, పెద్దలంతా బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తారు. కాన చుట్టుపక్కల పల్లెల్లో పండుగ హడావుడి నెలకొన్నా ఆ గ్రామంలో ఎటువంటి సందడి కనిపించదు. దాదాపుగా 70 ఏళ్లుగా ఆ ఊరు దీపావళికి దూరంగా ఉంటోంది. మరి ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అనకాపల్లి జిల్లాలోని కిత్తంపేట గ్రామం రావికమతం మండలం, జడ్.బెన్నవరం పంచాయతీలో ఉంది. 450 ఇళ్లు, 1500 జనాభా ఉంటారు. శివారు గ్రామమైనా జనాభా పరంగా జడ్.బెన్నవరం కంటే పెద్దది. రాజకీయంగా చైతన్యవంతం కావడంతో ఈ ఊరి వారే సర్పంచులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ఊరి వారంతా దీపావళి పండుగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. తమ చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ టపాసులు కాల్చలేదని చెబుతున్నారు.
అయితే గతంలో అందరిలాగే తమ ఊర్లోనూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకొనే వారు. 70 సంవత్సరాల కిందట ఊరంతా పాకలే ఉండేవి. గడ్డివాములు, మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, ఇంటి ఆవరణలోనే ఉండేవి. దీపావళి రోజున దివిటీలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మూగజీవాలన్నీ మృత్యువాతపడ్డాయి. అప్పట్నుంచి అన్నీ అపశకునాలే జరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా దీపావళి సమయంలోనే మరణాలు ఎక్కువగా సంభవించేవి. కీడు జరుగుతోందని నాటి పెద్దలు దీపావళికి దీపాలు వెలిగించడం మానేశారు. ఎవరూ పండుగ చేసుకోవద్దని నిర్ణయించారు. అదే ఆనవాయితీగా వస్తోంది. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి, టపాసులు కాలుస్తామని స్థానికులు వివరించారు.