Kishan Reddy At BJP Vijaya Sankalp Sabha Sangareddy : సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందన్న కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేపట్టారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం ప్రజల కోసం పని చేసే పార్టీ అని, హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు : కిషన్‌రెడ్డి
తెలంగాణలో కొందరు నాయకులు బీజేపీ ఏం చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని తెలిపారు. 2500 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు. కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరిగిందని వివరించారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు కేంద్రం చేపట్టిందని, ఇప్పటికే 3 వందే భారత్ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్ ప్లాంటు మంజూరు చేశామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు కోసం సర్వే జరుగుతోందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వివరించారు.