Doctors Remove Plastic Pen Cap Stuck In Man Lungs :కరీంనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పెన్ క్యాప్ మింగేశాడు. గత నెల రోజుల నుంచి దగ్గు రావడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. పది రోజులుగా దగ్గు విపరీతంగా పెరిగిపోయి, నిద్రపోవడానికి కూడా ఏమాత్రం వీలు కాకపోవడంతో వైద్యులకు చూపించగా సీటీ స్కాన్ తీయించారు. అప్పుడు ఎడమవైపు కిందిభాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిసింది. దాంతో వాళ్లు హైదరాబాద్ పంపారు. ఇక్కడ కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఆ యువకుడికి సీటీ స్కాన్ చేశారు. పెన్‌క్యాప్ ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న విషయం తెలుసుకుని దానికి చికిత్స చేసిన కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ నాదెళ్ల ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
యువకుడి ఊపిరితిత్తుల్లో పెన్‌క్యాప్ :తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న యువకుడు తమ హాస్పిటల్‌కు వచ్చినప్పుడు ముందుగా సీటీ స్కాన్ చేశామని డాక్టర్ శుభకర్ నాదేళ్ల తెలిపారు. అప్పుడు లోపల ఏదో ఒక గడ్డలా కనిపించిందని వివరించారు. ఆ గడ్డ వల్లే ఊపిరితిత్తుల వద్ద ఆటంకం ఏర్పడి దగ్గు వస్తోందని భావించామని అన్నారు. దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తూ లోపల చూసేసరికి పెన్ క్యాప్ కనిపించిందని, దాంతో ప్రొసీజర్ మధ్యలోనే ఆ యువకుడి అన్నను లోపలకు పిలిచి, గతంలో ఏమైనా మింగాడా అని అడిగామని ఆయన వివరించారు.
3 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స :5 ఏళ్ల వయసులో ఉండగా పెన్ క్యాప్ మింగేశాడని, అప్పట్లో తానే వైద్యుడి వద్దకు తీసుకెళ్తే అక్కడ పరీక్షించి లోపల ఏమీ లేదని, బహుశా మలంతో పాటు వెళ్లిపోయి ఉండొచ్చని అతని సోదరుడు చెప్పాడని డాక్టర్ శుభకర్ వివరించారు. దాంతో దాదాపు మూడు గంటల పాటు కష్టపడి, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ సాయంతో ముందుగా దాని చుట్టూ పేరుకుపోయిన కణజాలాలు, లింఫ్‌నోడ్, కండలను కొద్దికొద్దిగా తొలగించామని డాక్టర్ శుభకర్ నాదెళ్ల తెలిపారు. క్రమంగా అదంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఆ పెన్ క్యాప్‌ను కూడా బయటకు తీసేశామని వివరించారు.