Police Caught The Drug Buyer :రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఓ చోట ఇంకా డ్రగ్స్ మాట వినిపిస్తూనే ఉంది. కొంతమంది అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడు వ్యసనాలకు ఉపయోగిస్తున్నారు. డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ టెకీని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
డ్రగ్స్ కొంటున్నాడని అనుమానం కలిగి :వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలను డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్ చేస్తున్నాడనే సందేహం కలిగి అతడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. జులై 31వ తేదీన డార్క్ వెబ్ ద్వారా రాష్ట్రానికి డ్రగ్స్ వస్తున్నట్లు పక్కా సమాచారంతో అతనిపై దృష్టి పెట్టారు. అసోం నుంచి స్పీడ్ పోస్టులో ఖమ్మం జిల్లాకు మత్తు పదార్థాలు వస్తున్నట్లుగా సమాచారం తెలుసుకున్నారు.
కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు :ఈ నెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో టీజీ న్యాబ్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్ పేపర్లో డ్రగ్స్ చుట్టి ప్లాస్టర్ అంటించి డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన సమయంలో క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి, అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.