Khammam Farmers Facing Problems For Irrigation Water :ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంట కాల్వలు అస్తవ్యస్తంగా మారాయి. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు ఉభయ జిల్లాల్లో ప్రధానమైన సాగునీటి వనరుల ద్వారా ఆయకట్టుకు సాగు నీరందించేందుకు పంట కాల్వలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సాగు నీరందించాల్సిన కాలువలు, చెరువులు దయనీయంగా మారాయి. ఏటా వర్షాకాలానికి ముందు జిల్లాల వారీగా మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులు చేపట్టాల్సి ఉంది. ఈ తంతు ఏటా సాగుతూనే ఉన్నా, నిధులు హారతి కర్పూరంలా కరుగుతూనే ఉన్నాయి. కానీ కాల్వల దుస్థితి మాత్రం మారడం లేదని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు.
అసలు నీరందే పరిస్థితే లేదు :వైరా నియోజకవర్గంలోని వైరా జలాశయం కుడి ప్రధాన కాలువ, 25 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందించే వైరా మధ్యతరహా ప్రాజెక్టు కాల్వలు అధ్వానంగా తయారయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో కొన్నిచోట్ల మాత్రమే పూడిక తీశారు. మిగిలిన చోట్ల అధ్వానంగా ఉంది. దీంతో కట్టలు కుంగిపోయి కాలువ ఆనవాళ్లు కోల్పోయింది. చాలాచోట్ల పెరిగిన చెట్లతో నీరు పారే పరిస్థితి లేదు.
Paddy Crop Damage in khammam : సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు
కాలువలు బాగు చేయకపోతే చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నియోజకవర్గమే కాదు వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న పాలేరు, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లోనూ పంట కాల్వల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, సంబంధిత అధికారులు కాలువులు, చెరువుల మరమ్మతులు పూర్తి చేసి సాగు నీరందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.