Vinayaka Chavithi 2024 Celebrations : జంట నగరాల ప్రజలే కాదు, రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా దర్శనం చేసుకోవాలని ఎదురుచూసే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభమైంది. ఖైరతాబాద్ విగ్రహం ప్రతిష్ఠించి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగులతో భారీ గణనాథుని ప్రతిష్ఠించారు. సప్తముఖ మహాశక్తి రూపంలో ఈసారి గణపయ్య పూజలు అందుకుంటున్నాడు. ఏడు ముఖాలు, 14 చేతులు, చుట్టూ సర్పాలతో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు.
సీఎం రేవంత్ తొలి పూజ : రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని విగ్రహాలు ఉన్నా, ఈ బడా గణేషుడి ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఖైరతాబాద్ గణేషుడికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పణ కార్యక్రమం చేశారు. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలి పూజ అనంతరం, సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించారు. గణపతి ఉత్సవ సమితి అభ్యర్థన మేరకు హైదరాబాద్ నగరంలో లక్షా 40 వేల గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
"ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం కావడానికి వినాయక ఉత్సవ సమితి సభ్యులతో చర్చించాం. గణపతి ఉత్సవ సమితి అభ్యర్థన మేరకు హైదరాబాద్ నగరంలో లక్షా 40 వేల గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాము".- రేవంత్ రెడ్డి, సీఎం
గవర్నర్ జిష్ణుదేవ్ ప్రత్యేక పూజలు :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజల అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం మహా గణపతిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, వచ్చే ఏడాది మరింత వైభవంగా వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రసంగం ఆఖరున శ్లోకాలు చదివి గవర్నర్ ఆకట్టుకున్నారు.