Khairatabad Ganesh Nimajjanam 2024 : గణపతి బప్పా మోరియా అంటూ పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ప్రపంచంలోనే భారీ మట్టి గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్‌కు బారులు తీరారు. ఆ మహాగణనాథుని శోభాయాత్ర ప్రారంభమైంది. గణేశుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటుంది. కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు బడా గణేశుడి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పది రోజుల పాటు భక్తులకు నయానందకరంగా దర్శనం ఇచ్చిన స్వామి శోభాయాత్ర, భాగ్యనగరం వీధుల్లో ఘనంగా కొనసాగుతోంది.
మహా శక్తిగణపతి టస్కర్‌పైకి చేరిందిలా : ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కన్నులపండువగా దర్శనమిచ్చిన స్వామి గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం భక్తులకు దర్శనాలని నిలిపివేసిన ఉత్సవ కమిటీ సభ్యులు, అనంతరం మండపాలను తొలగించారు. వినాయక నిమజ్జనంలో కీలక ఘట్టమైన శోభాయాత్ర జరిగే ప్రాంతంలోని చెట్ల కొమ్మలను జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో తొలగించారు.
మచిలీపట్నానికి చెందిన టస్కర్ రెండు రోజుల క్రితమే ఖైరతాబాద్‌కు చేరుకోగా, భారీ గణనాథుడిని మండపం నుంచి దానిపైన నిలిపేందుకు వీలుగా వెల్డింగ్ పనులను పూర్తి చేశారు. గత రాత్రి సుమారు 10 గంటలకు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా హారతి ఇచ్చారు. అనంతరం కలశాన్ని కదిపి, పూజా కార్యక్రమాలను ముగించారు. ఇక రాత్రి 2 గంటలకు శ్రీ సప్త ముఖ మహా శక్తిగణపతిని భారీ క్రేన్ సహాయంతో టస్కర్‌పైకి చేర్చారు.