జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలు పరిశీలించిన కేసీఆర్ KCR Inspected Dry Crop Fields : తెలంగాణలో ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరిశీలించారు. తొలుత జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాలో పర్యటించిన గులాబీ దళపతి, రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి, యర్కారంలో ఎండిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన అన్నదాతలకు ధైర్యం చెప్పిన కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలోకి చేరుకున్న ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మార్గమధ్యలో కేసీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు.
KCR Fires on Congress : కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200ల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనికేసీఆర్ (KCR Visited Dried up Crops) ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయని, ఎకరాకు రూ.25,000ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏ ఆడబిడ్డా బిందె పట్టుకొని కనిపించలేదన్న కేసీఆర్, ప్రపంచమే మెచ్చిన మిషన్ భగీరథలో లోపాలెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. పట్టుకొమ్మల్లాంటి పల్లె సీమల్లో, ఇవాళ బోరుబండ్ల హోరు వినిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేసీఆర్ - బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ భరోసా - BRS Chief KCR Nalgonda Tour
తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితి :రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా తీర్చిదిద్దినట్లు కేసీఆర్ వివరించారు. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానం చేయించామని రెప్పపాటు సైతం కరెంట్ పోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించిందని గతంలో ఐఎల్ఓ సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వస్తున్నాయన్న ఆయన దేశంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితికి వచ్చిందన్నారు.
'విద్యుత్ రంగాన్ని సుమారు రూ.35,000ల కోట్లు ఖర్చు పెట్టి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని సంప్రందించి కరెంట్‌ను తీర్చిదిద్దాం. మా మెదడంతా కరగదీసి అద్భుతంగా కరెంట్ అందించాం. అప్పట్లో కరెంట్ పోతే వార్త ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త. ఇంత స్వల్పకాలంలో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది?.ఏడేళ్లపాటు అద్భుతంగా నడిచిన వ్యవస్థ ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా ఆగిపోయింది. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలుపట్టింది. ఉన్న వ్యవస్థను ఉన్నట్టు జరిపించుకోలేని అసమర్థత ఏంటి?.'- కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం
వంద రోజుల్లోనే అస్తవ్యస్తమవుతుందని భావించలేదు :అద్భుతమైన తెలంగాణ వంద రోజుల్లోనే అస్తవ్యస్తమవుతుందని భావించలేదని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రమంత్రులు తియ్యగా మాట్లాడితే కేఆర్ఎంబీకి అంతా అప్పగించారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్‌లో ఇప్పటికీ 14, 15 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రికి దిల్లీ యాత్రలు తప్ప, రైతుల బాధలు కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సముద్రమంత పార్టీ అని, ఒకరిద్దని గుంజుకున్నంత మాత్రాన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా, గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
KCR on Dry Crops :రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలకు ప్రకటించిన రూ.500లు బోనస్ తప్పనిసరిగా అమలు చేయాలని గులాబీ దళపతి డిమాండ్ చేశారు. గతంలో తాము 7600 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం నుంచి ప్రారంభించే వాటిల్లో ఒక్కటి తగ్గినా ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతి పత్రాలు, 6న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన ఆయన దానికి కొనసాగింపుగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకోనున్ననారు.
వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : కేసీఆర్ - KCR FIRES ON CONGRESS GOVT
'కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులు' - puvvada ajay kumar on farmers issue