Karthika Masam Popular Temples In Telangana :పవిత్ర కార్తిక మాసం దీపోత్సవాలతో శైవక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఆకాశదీపాలు, ఉసరిక దీపదానాలు, నమక చమక సహిత రుద్రాభిషేకాలు, బిల్వపత్రార్చనలు, పంచామృతాభిషేకాలు, మంగళహారతులను భక్తులు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తున్నారు. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రాలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ శివాలయాల ప్రత్యేకతలు తెలుసుకుందాం, దర్శించుకుందాం.
నీలకంఠేశ్వరాలయం విశిష్టత: ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వర గుడికి సుమారు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడి గర్భగుడిలో విష్ణువు నాభిలో నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండటంతో హరిహరనాథ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పార్వతీ దేవి మందిరం, మహా నందీశ్వరుడు, దాసాంజనేయుడు, వినాయకుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి, నాగేంద్రుడు, శివ ధ్యానమందిరం, పంచవటి, రథశాల ఉంటుంది.ప్రతి సోమవారం అభిషేకాలు, పల్లకీసేవ, అన్నదానం ఉంటాయి. రథసప్తమికి జాతర పెద్దఎత్తున నిర్వహిస్తారు. శివరాత్రికి బిల్వపత్రార్చనలు, అభిషేకాలతో పూజిస్తారు. కార్తిక మాసంలో ఆకాశదీపం, దీపారాధనలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
శంభునిగుడి విశిష్టత : నిజామాబాద్ జిల్లాలోనే అతి ప్రాచీన శివాలయం ఇది. నగరంలోని నెహ్రూపార్కుకు సమీపంలో ఉంది. శ్రీరాముడు పుష్పకవిమానంలో వెళ్తూ అనువుగా ఉన్న ఈ స్థలంలో శంభులింగేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు కథనం ఉంది. తర్వాతి కాలంలో దాతలు అభివృద్ధి పర్చారు. రాజగోపురం ఇక్కడి ప్రత్యేకత. ప్రత్యేక పూజల కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రతి నెలలో మాస శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. కార్తిక మాసంలో నిత్యం ఆకాశదీపం, దీపదానాలు, మంగళహారతులు సమర్పించనున్నారు. ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది.
వందేళ్ల నాటి శివలింగాలు విశిష్టత : నిజామాబాద్ జిల్లాకేంద్రం బ్రహ్మపురిలో కొలువైన నగరేశ్వర మందిరంలో రెండు శివలింగాలు ఉంటాయి. వందేళ్ల కిందటే నిర్మించారు. ఇక్కడ భూగర్భంలోనూ శివలింగం పూజలందుకుంటుంది. పైన మరో శివలింగానికి భక్తులు నిత్యం అభిషేకాలు, అర్చనలతో కొలుస్తారు. కార్తికంలో 30 రోజుల పాటు దీపదానాలు ఉంటాయి.