Kamepalli Tulasi Babu Warning to Police:ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ ఆఫీసు వద్ద కామేపల్లి తులసిబాబు అతని అనుచరులతో కలిసి హల్‌చల్ చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు బుధవారం విచారణకు హాజరయ్యారు. దీనికోసం కృష్ణా జిల్లా గుడివాడ నుంచి 35 కార్లలో అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా ఒంగోలుకు వచ్చారు.
ఈ సమయంలో తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. గుడివాడ వస్తే మీ సంగతి చూస్తా, నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ హెచ్చరించారు. యూనిఫాంపై ఉన్న మీ పేరు గుర్తుంచుకుంటామని, రేపటి వరకు విధుల్లో ఉండరని, వీఆర్‌కు వెళ్తారని, దమ్ముంటే యూనిఫాం వేసుకొని గుడివాడకు రండి అంటూ సీఐలు, కానిస్టేబుళ్లను తులసిబాబు బెదిరించారు.
ఊరు అవతల ఎస్పీ కార్యాలయం కట్టుకోవాలి: ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, తులసిబాబు ఫొటోలున్న కార్లలో ఒంగోలుకు భారీ ర్యాలీగా వచ్చారు. వాహనాలను ఎస్పీ ఆఫీసు ఎదుట నిలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. తులసిబాబుని మాత్రమే లోనికి వెళ్లాలని పోలీసులు స్పష్టం చేయగా, తాము కూడా వెళ్తామని, ఎస్పీని కలుస్తామంటూ అతని అనుచరులు తోసుకుంటూ వెళ్లేందుకు యత్నించారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ తులసి బాబు అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు తులసిబాబు కారుని మాత్రమే లోపలికి అనుమతించి, మిగిలిన వారిని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట నిలిపిన కార్లును తీయాలని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని పోలీసులు సూచించగా, ఊరు అవతల ఎస్పీ కార్యాలయం కట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వాహనాలను అక్కడ నుంచి తొలగించారు. కాగా రఘురామ కృష్ణరాజుపై దాడి చేసిన సమయంలో తులసిబాబు సైతం ఉన్నారని ఆరోపణ రావడంతో పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఎస్పీ దామోదర్ తులసి బాబును విచారణ చేశారు.
మరోసారి కస్టడీకి విజయ్‌పాల్ - 27 కార్లతో విచారణకు తులసిబాబు