Kamareddy Farmers Problems With Bank Employees : నిజామాబాద్ డీసీసీబీ బ్యాంకు అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంతో రైతుల భూమిలో బ్యాంకు ఫ్లెక్సీలు పెట్టి వేలం వేస్తామని రైతులను హెచ్చరించారు. కొందరి రైతుల భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఆరా తీశారు. బ్యాంకు అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి వెల్లడించారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఇతరులకు విక్రయిస్తుండటం వల్లే అలా పెట్టాల్సి వచ్చిందని బ్యాంకు అధికారులు స్పందించగా మంత్రిగా ఘాటుగా స్పందించారు. ఇలా ప్లెక్సీలు పెట్టడం లాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి హెచ్చరించారు.
అసలేం జరిగింది :కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు 2010లో డీసీసీబీ (డిస్టిక్ కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు)లో రూ.5లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించి ఆపేశాడు. భూమి మీద తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంక్ అధికారులు రైతుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. రైతు నుంచి సమాధానం రాకపోవడంతో బహిరంగ వేలం వేస్తామని లింగంపేట ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
రైతుల ఇళ్లకు తాళాలు.. పిల్లలతో చలిలోనే అన్నదాతలు..!
"రాజశేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ కొనుగోలుకు బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. మేము చాలాసార్లు అడిగినా కట్టలేదు. అయితే దీనిపై అతని భూమి వేలానికి వేయమని మా పై అధికారులు సూచించారు. అందుకే అతని భూమిలో జెండాలు పాతడం జరిగింది. నిన్న కూడా అతన్ని 3గంటల లోపు డబ్బుని కట్టడానికి సమయం ఇచ్చాం అయినా కట్టలేదు. ఇప్పటికైనా సగం లోన్ డబ్బులు కడితే వేలం ఆపేస్తాం." - కుమార స్వామి, బ్యాంకు మేనేజర్