Kakinada GGH Doctors Brain Surgery to Patient :కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) మంగళవారం మధ్యాహ్నం, ఓ మహిళా పేషెంట్ చేతిలో ట్యాబ్ ఉంది. తనకు ఇష్టమైన ‘అదుర్స్’ మూవీలోని జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం నడుమ నడిచే హాస్య సన్నివేశాలను ఆమె చూస్తున్నారు. సినిమాలో నిమగ్నమై ఉండగా ఆమె మెదడులో ఏర్పడిన కణితి తొలగింపు శస్త్రచికిత్సను వైద్యబృందం పూర్తిచేసింది. మెలకువలో ఉండగానే (అవేక్ క్రేనియాటమీ) క్లిష్టమైన ఈ సర్జరీని పూర్తి చేయడం ద్వారా వారు ప్రశంసలందుకున్నారు.
కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ.అనంతలక్ష్మి (55)కి కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి తీవ్రంగా లాగుతుంది. ఆమెను పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యం ఖర్చుతో కూడినదని, నయం కావడం కష్టమని ఆయా చోట్ల డాక్టర్లు తెలిపారు. ఈనెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా అనంతలక్ష్మిని కాకినాడలోని జీజీహెచ్‌లో చేర్పించారు.
‘అదుర్స్’ మూవీ ఆనందంలో ఉండగా : వైద్యులు పరీక్షించి అనంతలక్ష్మి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ ద్వారా దానిని తొలగించారు. ‘అదుర్స్’ మూవీ చూపిస్తూ అనంతలక్ష్మి ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారు.