Increased Demand for Snacks and Sweets During Sankranti : సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్లన్నీ పిండి వంటలతో ఘుమఘుమలాడుతాయి. రకరకాల పిండివంటలు తయారు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం బయటదొరికే పిండివంటలపైనే చాలా మంది ఆధారపడుతున్నారు. దీంతో విజయవాడలో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
మన పండుగలన్నీ ఆహ్లాదాన్ని పంచేవే. ముఖ్యంగా సంక్రాంతి మరీ మరీ ప్రత్యేకమైంది. ఆకాశంలో చుక్కలు నేల మీద రాలినట్లు వాటికి తీర్చిదిద్ది రంగురంగుల ముగ్గులు వేస్తారు మగువలు. వాటిని చూస్తుంటే అంతులేని ఆనందం కలుగుతుంది. మరోవైపు పతంగుల జోరు, డూడూ బసవన్నల హోరు ఆ సందడికి పిండి వంటల ఘుమాయింపులు తోడైతే ఇక చెప్పేదేముంది సంతోషాల వెల్లువే!
సంక్రాంతి వేళ దూరప్రాంతాల్లో స్థిరపడిపోయిన వారు కూడా సొంతూళ్లకు వచ్చి వేడుకలు నిర్వహించుకుంటారు. ఇంటికి వచ్చేవారికి పిండి వంటలు తయారు చేసి వడ్డించేవారు. చిన్నా, పెద్ద అందరూ కలిసి పిండి వంటకాల తయారు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
పిండి వంటలు చేసే వారు తక్కువైపోయారు. మార్కెట్లో దొరికే పిండి వంటలపైనే ఆధారపడుతున్నారు. నేతి అరిసెలు, చెక్కలు, నువ్వుల లడ్డూలు, కారబ్బూందీలు, కజ్జికాయలు, సకినాలు ఇలా పలు రకాల పిండివంటలు కొనుగోలు చేస్తున్నారు. దుకాణాల్లోనూ రుచికరమైన పిండివంటకాలు దొరుకుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఊరూ వాడ సంక్రాంతి శోభ- సందడంతా చిన్నారులు, యువతదే
బిజీ బిజీగా అరిసెలు చేస్తూ రంగురంగుల పిండివంటలు తయారు చేస్తున్న వారందరినీ చూస్తే పండగంతా అక్కడే అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇది విజయవాడలోని హోమ్‌మేడ్ పిండివంటల దుకాణం. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్, హాట్ ఐటమ్స్‌తో సహా కావాల్సిన ఆర్డర్లు తీసుకుని వాళ్ల కళ్లముందే తయారు చేయటం వీరి ప్రత్యేకత. కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నందున దుకాణాలపైనే ఆధారపడుతున్నామని కొనుగోలుదారులు అంటున్నారు.
కొనుగోలుదారుల అభిరుచికు అనుగుణంగా వివిధ రకాల పిండివంటలను వ్యాపారులు తయారు చేయిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ వారు సైతం ఆర్డర్లు పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పిండి వంటలకు డిమాండ్ పెరిగిందని దుకాణ యజమానులు చెబుతున్నారు.