MP YS Avinash Reddy House Arrest : కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవినాష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పులివెందులలో గృహనిర్బంధం చేశారు. వివరాల్లోకి వెళితే, సాగునీటి సంఘాల ఎన్నికల అంశానికి సంబంధించి వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు పోటాపోటీగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి వేముల తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారనే సమాచారంతో ముందుగానే అక్కడికి స్థానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఆ సమయంలో సాక్షి ప్రతినిధులు అక్కడికి రావడంతో వారిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లు చెబుతున్నారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి నేరుగా వేముల పోలీస్ స్టేషన్ కు వచ్చి దాడి ఘటనపై ఆరా తీశారు.
అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - జల్లెడ పడుతున్న పులివెందుల పోలీసులు
ఆ సమయానికి అవినాష్ రెడ్డి వెంట వందలమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని అవినాష్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పాల్గొనాలంటే వీఆర్వోలు నోడ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు.