Justice PC Ghosh Asked for Interim Report on Kaleshwaram Project : మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్ నేడు నిపుణుల కమిటీతో సమావేశమైంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించిన కమిటీ సభ్యులు వారి పరిశీలన, అధ్యయనంలో గుర్తించిన అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు వివరించారు. సాంకేతిక పరమైన అంశాలు, అంతర్జాతీయ పరంగా అవలంభించే విధానాలను తెలిపారు. బ్యారేజీలుగా నిర్మించి ఎక్కువ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తిందని వారు కమిషన్కు చెప్పినట్లు సమాచారం.
ఈ పరిశీలన అంశాల ఆధారంగా రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత పూర్తి నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. నేడు హైడ్రాలజీ విభాగానికి చెందిన ఇంజినీర్లను కమిషన్ విచారణ చేసింది. వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్లు అన్నీ వచ్చి పరిశీలించిన తర్వాత బీఆర్కే భవన్లోని బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు. అఫిడవిట్ల పరిశీలన అనంతరం సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
సాంకేతిక అంశాల అనంతరం ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనుంది. ఆనకట్ట నిర్మాణ అంచనాలు, రుణాలు, వడ్డీ రేట్లు, తదితరాలపై విచారణ చేయనున్నారు. అటు కొంతమంది వ్యక్తులు, ఇతర మార్గాల్లో కూడా కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. విజిలెన్స్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదిక సమర్పించాలని గతంలోనే కమిషన్ ఆదేశించినా అది ఇప్పటికీ చేరలేదని అంటున్నారు. దీంతో వెంటనే నివేదిక సమర్పించాలని కమిషన్ మరోమారు స్పష్టం చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నుంచి కమిషన్ నివేదిక కోరింది. విచారణ ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక పర్యటనలకు కూడా వెళ్లాలని జస్టిస్ పీసీ ఘోష్ భావిస్తున్నట్లు సమాచారం.