Kaleshwaram Project Judicial Inquiry Update :కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, తదుపరి సాక్ష్యాల నమోదుకు సిద్ధమవుతోంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చిన అఫిడవిట్లను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత అందులోని అంశాల ఆధారంగా నోటీసులు జారీ చేసి సాక్ష్యాలు నమోదు చేస్తారు. అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ నిర్వహించనున్నారు.
విచారణ ప్రక్రియలో భాగంగా ఇవాళ కమిషన్ ముందు పంప్‌హౌస్‌లకు చెందిన 14 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ పంప్‌హౌస్‌లకు చెందిన ఇంజినీర్లు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులు వారిలో ఉన్నారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్, వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలుకు ఈ నెల 16వ తేదీ వరకు గడువిచ్చారు. పంప్ హౌస్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ఇచ్చిన నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కమిషన్‌కు అధికారికంగా సమర్పించింది. నివేదికను పరిశీలించిన తర్వాత అందులోని అంశాల ఆధారంగా కాగ్ అధికారులను పిలిచి పూర్తి వివరాలను తీసుకునే ఆలోచనలో కమిషన్ ఉంది. కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా మూడు ఆనకట్టలకు సంబంధించి తమ అధ్యయన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్‌కు సమర్పించారు.