Justice PC Ghosh Commission Inquiry On Finance Officers :కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక స్థోమత, క్రమశిక్షణా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్స్క్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని కమిషన్ ప్రశ్నించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, సంబంధిత అంశాలపై ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల జీతాలు, చెల్లింపుల గురించి ఆరా తీశారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు చెప్పిన వెంకట అప్పారావు, వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్లు తెలిపారు. కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా, రుణాలు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది.
ప్రాజెక్టులో ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాత రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు రుణాలు తీసుకున్న తర్వాత ఏమైనా ఆస్తులు వచ్చాయా అని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని, ఆస్తులు రాలేదన్న అధికారులు, బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని తెలిపారు. కాగ్ నివేదిక గురించి అకౌంట్స్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు విషయంలో కాగ్ నివేదికతో అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.