Justice PC Ghose Commission Visit Kaleshwaram :కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ రేపు మరో దఫా రాష్ట్రానికి రానున్నారు. రేపు సాయంత్రం హైదరాబాద్ వచ్చి పది రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు. జస్టిస్ ఘోష్ ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు.
క్షేత్రస్థాయిలో మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశమయ్యారు. మూడు ఆనకట్టలపై ప్రజల నుంచి ఫిర్యాదులను కూడా కమిషన్ కోరింది. ఆ గడువు కూడా ఇప్పటికే పూర్తయింది. రేపు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏడో తేదీ నుంచి అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను జస్టిస్ పీసీ ఘోష్ సందర్శించనున్నారు. అనంతరం హైదారాబాద్ లో నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు.
'వరద వచ్చేలోపు పనులు పూర్తవ్వాలి లేకపోతే ముప్పు' - చకచకా మేడిగడ్డ మరమ్మతు పనులు - Medigadda Barrage Temporary Repairs
ఐఐటీ, ఎన్ఐటీ సహా ప్రతిష్టాత్మక సంస్థల సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించింది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఇచ్చిన వివరాలు, సమాచారం, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సహా ఇతర అంశాలపై జస్టిస్ ఘోష్ వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత విచారణ ప్రక్రియను కొనసాగించనున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతరులను విచారణ చేయవచ్చని అంటున్నారు. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వారి ఆధారంగా విచారణ ప్రక్రియ కొనసాగించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ :మరోవైపు కమిషన్‌కు సాంకేతిక అంశాలపై సాయం కోసం సిబ్బందిని కూడా నీటిపారుదల శాఖ కేటాయించింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఇప్పటికే నోడల్ అధికారిగా నియమించింది. అలాగే ఇన్వెస్టిగేషన్, డీపీఆర్ తయారీ, ప్రాజెక్ట్ నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఓఅండ్‌ఎం తదితర విభాగాల వారీగా నిపుణులైన అధికారులను నియమించారు. 20 మందికి పైగా వివిధ స్థాయిల్లోని ఇంజినీర్లను కమిషన్ కోసం కేటాయించారు.
మేడిగడ్డ బ్యారేజీలో సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థ పరీక్షలు - మెటీరియల్, మట్టి నమునాలు సేకరణ
మేడిగడ్డ బ్యారేజీకి నష్టంపై అంచనా - ఇన్వెస్టిగేషన్లకు పట్టనున్న మరింత సమయం - Medigadda Investigation Delay