Justice PC Ghose Commission on Kaleshwaram Project :కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మూడు బ్యారేజీల్లోని లోపాలకు సంబంధించిన అంశాలపై కమిషన్ తొలుత దృష్టి సారించింది. అందులో భాగంగా అక్కడ ప్రస్తుతం ఉన్న, గతంలో విధులు నిర్వర్తించిన ఇంజినీర్లను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. ఆనకట్టల పనులు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణ చేసిన కమిషన్, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది.
ఆర్థిక పరమైన అంశాలపై విచారణ : ఆ సమయంలో సాంకేతిక అంశాలపై కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే తమ అధ్యయన నివేదికను సమర్పించింది. అందులోని కొన్ని అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ మరింత వివరణ కోరారు. మూడు ఆనకట్టలకు అనుబంధంగా పంపుహౌస్‌లు ఉన్నందున అక్కడి ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారణ చేసింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఉన్న పూర్తి సమాచారం, అన్ని వివరాలను అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే నీటి పారుదల శాఖను ఆదేశించారు.
ఇంజినీర్ల నుంచి సమాచారం : జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికలను పరిశీలించారు. తుది నివేదికలు ఇవ్వాలని వారికి ఇప్పటికే స్పష్టం చేశారు. విశ్రాంత ఇంజినీర్లు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు ఇతర ఇంజినీర్ల నుంచి అవసరమైన సమాచారం, వివరాలు సేకరిస్తోంది. వివిధ సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన విద్యుత్ శాఖ ఇంజినీర్ రఘు, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లు, అందులోని అంశాల ఆధారంగా తదుపరి సాక్ష్యాల నమోదు, బహిరంగ విచారణకు కమిషన్ సిద్ధమవుతోంది.