ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు? - ప్రజాధనం వృథా కాదా? : జ్యుడిషియల్‌ కమిషన్ - Commission on Yadadri Thermal plant - COMMISSION ON YADADRI THERMAL PLANT

Judicial Commission on Yadadri Thermal plant : కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం పాటించకుండా టెండర్లు పిలవకుండా నిర్మాణం, కొనుగోలు చేపడితే ఆర్థికభారంతో పాటు ప్రజాధనం వృథా కాదా? అని యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుపై ఏర్పాటైన జ్యుడిషియల్‌ కమిషన్‌ అధికారులను ప్రశ్నించింది.

Yadadri Thermal plant
Judicial Commission on Yadadri Thermal plant (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 9:26 AM IST

Judicial Commission on Yadadri Thermal Plant : కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం పాటించకుండా టెండర్లు పిలవకుండా నిర్మాణం, కొనుగోళ్ల వల్ల ఆర్థికభారం అధికమై ప్రజాధనం వృథా కాదా? అని యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ అధికారులను ప్రశ్నించింది. ఈ మేరకు కమిషన్‌ సోమవారం విచారణ జరిపింది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేశ్​ చందా, అప్పటి జెన్‌కో-ట్రాన్స్‌కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావులను కమిషన్‌ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది.

యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా బీహెచ్‌ఈఎల్‌(భెల్‌)కు కేటాయించాల్సిన అవసరం ఏంటని కమిషన్‌ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో టెండర్లు పిలిచి, తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలనే నిబంధనలుంటే వాటిని ఎందుకు పాటించలేదని నిలదీసింది. భెల్‌ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అనేది టెండర్లు పిలిస్తేనే కదా తెలిసేదని ప్రశ్నించింది. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేటాయించడం వల్ల ఆర్థికభారం అదనంగా పడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందని కమిషన్‌ అడిగినట్లు తెలుస్తోంది.

విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థికభారం :మాజీ సీఎండీ ప్రభాకరరావు సమాధానమిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భెల్‌కు కేటాయించామని, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొన్నట్లు వివరించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యమని ముందుగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని జాతీయ విద్యుత్‌ కారిడార్‌ను సరఫరా కోసం తీసుకున్నట్లు ప్రభాకరరావు వివరించారని సమాచారం.

పీపీఏ చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించడానికి ఇతర విద్యుత్‌ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అని అధికారులను కమిషన్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో ఎంత తక్కువ ధరకు కరెంటు లభిస్తుందనేది టెండర్లు పిలిస్తేనే తెలుస్తుందని, దానికి అవసరమైన కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానాన్ని పక్కనపెట్టేసి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థికభారం పడింది కదా అని కమిషన్‌ పేర్కొన్నట్లు సమాచారం.

మంగళ, బుధవారాల్లో జ్యుడిషియల్‌ కమిషన్‌ విచారణ : గతంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారులు జోషి, అర్వింద్‌కుమార్‌లు మంగళ, బుధవారాల్లో విచారణకు రావాలని కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో హడావుడిగా ఒప్పందం చేసుకుని కరెంటు కొంటే దీర్ఘకాలంలో రాష్ట్రంపై ఆర్థికభారం పడి నష్టపోతామని అర్వింద్‌కుమార్‌ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడే అప్పటి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దానిని కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.

ఈ విషయంపైనా కమిషన్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అర్వింద్‌కుమార్‌ ముందుగా హెచ్చరించినట్లుగానే ఛత్తీస్‌గఢ్‌ కరెంటు వల్ల ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థికభారం పడింది. విచారణలో అర్వింద్‌కుమార్‌ ఏం చెబుతారనేది కీలకంగా మారింది. యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ ఖర్చు పెరుగుదలకు కారణాలు, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ముందు జరిగిన నిర్ణయాలకు సంబంధించిన సమాచారమంతా రాష్ట్ర ఇంధన శాఖ కమిషన్‌కు సమర్పించింది. విచారణలో అధికారులు చెబుతున్న సమాధానాలకు అనుగుణంగా మరింత సమాచారాన్ని కమిషన్‌ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details