Justice LN Reddy Commission Wrote Another Letter to KCR :తెలంగాణలోయాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గడ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈనెల 19న విచారణ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రెండో లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహా రెడ్డి జ్యుడీషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది.
ఈనెల 27లోపు సమాధానం ఇవ్వాలన్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ : గతంలో మొదటి లేఖ రాసి ఈ నెల 15 లోపు సమాధానం ఇవ్వాలని కోరడంతో 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కమిషన్ ముందు పలువురు విద్యుత్ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ వద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ నరసింహారెడ్డికి తెలియజేశారు.
విద్యుత్ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు అందజేసిన సమాచారాన్ని, సందేహాలను జోడిస్తూ జస్టిస్ నరసింహా రెడ్డి ఈ నెల 19న మరోసారి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నెల 27 లోపు సమాధానం అందజేయాలని కోరారు. కేసీఆర్ లేఖ రూపంలో సమాధానం అందజేసినా, వ్యక్తిగతంగా తెలియజేసినా ఎటువంటి అభ్యంతరం లేదన్నట్లు సమాచారం.