Notices To KCR in Chhattisgarh Power Purchase Deal : తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పంద విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది.
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్‌కు నోటీసులు : ఈ అంశంలో కేసీఆర్, మాజీ ఇంధన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన అర్వింద్ కుమార్, ఎస్‌కే జోషి, సురేశ్ చందా, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30వ తేదీ వరకు సమయం కోరగా జూన్ 15వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.
"ఒకటి ఛత్తీస్‌గఢ్ నుంచి పవర్ కొనుగోలు ఒప్పందం, రెండోది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడోది యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్‌గా అనుమతులు ఇచ్చినవే. ఈ ప్రక్రియలో దాదాపు 25 మంది ఉన్నట్లు గుర్తించాం. ఇందులో నిర్ణయాలు తీసుకున్న అధికారులు, అనధికారులు అందరికీ నోటీసులు జారీ చేశాం. అలానే వారు సమాధానం ఇచ్చారు. వారిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే జులై చివరి వరకు సమయం అడిగగా, మేము అందుకు జూన్ 15 వరకు టైం ఇచ్చాం."- జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి