Telugu Nyaya Palana Meet in Vijayawada:తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్దామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ కె.మన్నథరావు తెలిపారు. 'అమ్మ భాషను మాట్లాడదాం - ఆత్మాభిమానం చాటుకుందాం' అని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా నిర్వహించిన 'తెలుగులో న్యాయపాలన' సమావేశంలో జస్టిస్ కె. మన్మథరావు మాట్లాడారు.
తెలుగులో తీర్పు రాశాను అనే విషయం తనకెంతో ఆనందంగా ఉందని జస్టిస్ కె.మన్మథరావు అన్నారు. న్యాయమూర్తి అయ్యాక ఎక్కడికి వెళ్లినా మాతృభాషలోనే మాట్లాడినట్లు పేర్కొన్నారు. తెలుగులో తీర్పులు ఇస్తేనే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని తెలిపారు. తెలుగులో తీర్పు ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నా ఆయన, ఆంగ్లంలో ఉన్న తీర్పును తెలుగులోకి మార్చి తీర్పు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ తీర్పుల వల్ల అప్పీళ్లకు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందని ఆయన అన్నారు.
వాళ్లే స్ఫూర్తి :మాతృభాషలో డాక్యుమెంట్ ఉన్నా కొందరు ఆత్మన్యూనతతో ఆంగ్లంలో చదువుతున్నారని జస్టిస్ భీమపాక నగేశ్ అన్నారు. తాము తెలుగులో తీర్పు ఇస్తే ఆంగ్లంలో అభినందనలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. మాతృభాషలో చదువుకునే హైకోర్టు న్యాయమూర్తుల స్థాయికి ఎదిగామని, తెలుగు భాష సహకారంతో వృత్తిపరంగా ఎక్కువ బాగుపడ్డామన్నారు. మాతృభాషలో తీర్పు ఇచ్చేందుకు తనకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలుగును బాగా చదివితే ఆంగ్ల అనువాదం, నేర్చుకోవడం చాలా సులభమవుతుందని తెలిపారు. మన తెలుగు భాష అద్భుతమైందన్న ఆయన దీన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
'భాషను బతికించడంలో మీడియా పాత్ర ఎంతో ఉంది - తెలుగు భాష మన అస్తిత్వం'
ప్రతి ఒక్కరూ తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించాలని జస్టిస్ బి. కృష్ణ మోహన్ తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులకు భాషలోని లెస్సదనాన్ని తెలియజెప్పాలని, మన కవులు, వాగ్గేయకారుల గురించి తెలియజేయాలని అన్నారు. మాతృభాషను కేవలం వాడుగ భాషగానే పరిగణించడం సరైంది కాదన్న ఆయన పిల్లలకు తల్లిదండ్రులు మాతృభాష అందిస్తేనే భవిష్యత్తులో తెలుగుని చూడగలమని, వినగలమని, ఎందరో మహానుభావులు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. పాఠశాలల్లో మాతృభాషను ఆప్షనల్ సబ్జెక్టుగా చేయొద్దన్నారు. పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని కోరారు.