Junior Doctors Strike in Telangana: సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. సోమవారం రోజున వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, డీఎంఈ తో జరిపిన చర్చలు విఫలమవడంతో యధాతథంగా సమ్మె నిర్వహిస్తున్నారు. శిక్షణ భృతి సకాలంలో అందించడం సహా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం వంటి 8 ప్రధాన డిమాండ్‌లను జూడాలు ప్రభుత్వం ముందుంచారు. కొన్ని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినా మరికొన్నింటిపై స్పష్టత రాలేదు. ఐతే, ఆస్పత్రుల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని వైద్యులను ప్రభుత్వం ఆదేశించింది.
రెండో రోజు కోఠి మెడికల్ కళాశాల ముందు జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. వైద్య కళాశాల్లో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం తదితర డిమాండ్లతో ఈ నెల 18న సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతో విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఓపీ సేవలు, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తున్నామని, ప్రస్తుతానికి అత్యవసర సేవలు యధావిధిగా కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.