Junior Doctors Call Off Strike in Telangana :తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాలు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సమ్మెకు విరామం ప్రకటించారు. అయితే ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవన ఏర్పాటుపై మాత్రం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అక్కడ సమ్మె కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు అర్ధరాత్రి వరకు జరిపిన చర్చల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వసతి భవనాలకు నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. నేడు రెండు జీవోలు విడుదల చేస్తామని జూడాలకు హామీ ఇచ్చింది. జూడాలకు ఇచ్చిన 3 హామీల సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఉస్మానియా, గాంధీ జూడాల వసతిగృహాల నిర్మాణానికి సర్కార్ జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధుల విడుదలు మంజూరు చేస్తున్నట్లు జీవో విడుదల చేసింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ వర్సిటీలకు రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆస్పత్రికి రూ.79.50 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.