Change In BTech Syllabus in Telangana :రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఏటా లక్ష మందికి పైగా పట్టభద్రులు అవుతున్నారు. కానీ వీరిలో 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కారణం ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యాలు పెంచే పాఠ్యాంశాలు సిలబస్‌లో లేకపోవడం. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ను సమూలంగా మార్చాలని అనుకుంటున్నారని జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. రెండు నెలల్లో సిలబస్‌లో మార్పులు, చేర్పులు పూర్తి కానున్నాయని, కొత్త సిలబస్‌ను ప్రభత్వం ఆమోదంతోనే అమలు చేయనున్నామని వివరించారు.
వాళ్ల సలహాలు సూచనలు తీసుకొని మార్పులు :కొత్తగా రూపొందించనున్న సిలబస్‌పై మాట్లాడిన ఆయన విదేశీ విశ్వవిద్యాలయాల ప్రమాణాలతో పోటీ పడేలా ఉంటుందని తెలిపారు. దీనిపై ఇప్పటికే వందల మంది విద్యావేత్తల సలహాలు, సూచనలు తీసుకున్నామన్న ఆయన, ఇంజినీరింగ్ విద్యా ప్రమామాల పెంపుపై ఐఐటీ మద్రాస్ అధికారుల సహాకారంతో బుధ, గురువారాల్లో వర్క్‌షాప్ నిర్వహించినట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి 20 మంది ఉపకులపతులు, 200 మంది విద్యావేత్తలు హాజరయ్యారని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు రూపొందించాల్సిన ప్రమాణాలపై సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. వాటన్నింటిని క్రోడీకరించి సిలబస్ రూపకల్పనలు వినియోగిస్తున్నామని వివరించారు.