JD Lakshminarayana on Telugu : సహజసిద్ధంగా వచ్చే భాషే మాతృభాషని విశ్రాంత ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అమ్మ అనే పదంలో ఉన్న మాధుర్యం మమ్మీలో రాదన్నారు. పసితనంలో మాతృభాషను చంపేయడం భ్రూణహత్యతో సమానమన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధి, భాష పరిరక్షణ, రాజకీయ నాయకుల పాత్రపై ఆయన మాట్లాడారు.
"మన ప్రయత్నం ఏమీ లేకుండా మనలో నుంచి వచ్చే భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే మాతృభాష. సహజసిద్ధంగా ఆలోచించే విధానమే మాతృభాష. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని మనం కాపాడుకోవాలి. అమ్మా అన్న మాటలో ఉన్న మాధుర్యం మమ్మీలో ఉండదు. ఎందుకంటే అమ్మ అనే పదం మన మాతృభాషలోనిది కాబట్టి ఆ మాధుర్యం అలా ఉంటుంది. పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు ఈ మాధుర్యం నుంచి మనం దూరం చేయకూడదనేది చాలా ముఖ్యం. చందమామ అని తల్లినేర్పిస్తుంది. కానీ స్కూల్కు వెళ్లగానే మూన్ మూన్ అని చెప్పి చందమామ అనే పదాన్ని వారి మెదళ్లలోంచి తీసేస్తున్నారు. బాల్ అని చెప్పి బంతిని వాళ్ల మెదళ్లలోంచి తీసేస్తున్నారు. కాబట్టి పసితనం నుంచే వారి వద్ద నుంచి ఆ భాష తీసివేయడమనేది ఒక బ్రూణహత్యతో సమానమని నేను ప్రతిపాదిస్తున్నాను"- జేడీ లక్ష్మీ నారాయణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి