తెలంగాణ

telangana

ETV Bharat / state

జన్వాడ ఫాంహౌస్​ను ఏ అనుమతులు తీసుకోకుండానే కట్టేశారు! - Hydra Focus on Janwada Farm House - HYDRA FOCUS ON JANWADA FARM HOUSE

Hydra Focus on Janwada Farm House : అక్రమ నిర్మాణాలను కూల్చుతూ, ఆక్రమణదారుల్లో హడల్‌ పుట్టిస్తున్న హైడ్రా బుల్డోజర్లు, త్వరలోనే జన్వాడ ఫాంహౌస్‌ వైపు కదలనున్నాయి. ఈ ఫాం హౌస్ బుల్కాపూర్‌ నాలా బఫర్‌జోన్‌ పరిధిలో ఉందన్న ప్రచారం మేరకు అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించగా, నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి చేరుతుందని, అది అందిన వెంటనే హైడ్రా రంగంలోకి దిగుతుందని సమాచారం.

Janwada Farm House
Janwada Farm House has no Permissions (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 3:21 PM IST

Janwada Farm House has no Permissions : హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఫాంహౌస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ అధీనంలో ఉండటం, బుల్కాపూర్‌ నాలా బఫర్‌జోన్‌ పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించారని సమాచారం.

మీర్జాగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 8 ఏళ్ల క్రితం ఈ జన్వాడ ఫాంహౌస్‌ను నిర్మించారు. అప్పట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి దీనిని అక్రమ కట్టడంగా గుర్తించారని తెలుస్తోంది. ఈ మేరకు ఫాంహౌస్‌ యజమాని ఎన్‌ఎస్‌ఎల్‌ఆర్‌ ప్రసాద రాజు చిరునామాకు నోటీసులు సైతం పంపించారని సమాచారం. ఆ నోటీసులపై ఆయన స్పందించకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్ది రోజుల తర్వాత ఫాంహౌస్‌కు ఇంటి నంబర్‌ 4-5 కేటాయించి అసెస్‌మెంట్‌ చేశారు.

జన్వాడ ఫాంహౌస్​ను సర్వే చేసిన అధికారులు - కిలోమీటరు వరకు నాలా పరిశీలన - Janwada Farm House Survey today

ఫామ్‌హౌస్‌ 111 పరిధిలో ఉందని తెలిసినా : ఫాం హౌస్‌ (జీ ప్లస్‌1) విస్తీర్ణం 362 గజాలని, 3,200 చదరపు అడుగుల్లో ఉందని గ్రామ పంచాయతీ అధికారులు లెక్కలు వేసి, సంవత్సరానికి రూ.11 వేలు పన్ను చెల్లించాలని అసెస్‌మెంట్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీవో నంబర్ 111 పరిధిలో ఫామ్‌హౌస్‌ ఉందని తెలిసినా, దాన్ని వేరే యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్న భావనతో అప్పట్లో వారు పన్ను మాత్రమే విధించారు. ఆ మేరకు నిర్వాహకులు ఏటా ఇంటి పన్ను చెల్లిస్తున్నారు.

ఉపగ్రహ చిత్రాలతో సరిపోల్చి :జన్వాడ ఫాంహౌస్‌ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్‌ నాలా పరీవాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు గురువారం సర్వే పూర్తి చేశారు. ఉపగ్రహ చిత్రాలు, గ్రామ పటాలను సరిపోల్చారు. నాలా బఫర్‌జోన్‌లో ఫామ్‌హౌస్‌ ఉందా? లేదా? అని నిర్ధారించుకున్నాక రంగారెడ్డి కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు. ఈ నివేదిక అందిన వెంటనే హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్‌హౌస్‌ వైపు రానున్నాయి.

జన్వాడ ఫాంహౌస్​ వివాదంలో కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. తీర్పు రిజర్వ్

ABOUT THE AUTHOR

...view details