Jani Master Verdict Posteponed for Wednesday : జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. 5 రోజుల కస్టడీ కోసం నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై కూడా బుధవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ :పరారైన జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిర్థారించుకున్నారు. పెద్ద హోటళ్లలో ఉంటే ఆచూకీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో జానీ మాస్టర్ ఒక చిన్నహోటల్‌లో తలదాచుకున్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసుల బృందం 18వ తేదీ సాయంత్రం హైదరాబాద్ నుంచి గోవాకు బయల్దేరింది. 19వ తేదీ తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకువచ్చారు.
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 2019లో జానీకి బాధితురాలు పరిచయమైందని, దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో జానీ లైంగిక దాడి చేశారని, ఆ సమయంలో బాధితురాలి వయసు 16 ఏళ్లు అని వెల్లడించారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి పాల్పడ్డారని, విషయం బయటకు రాకుండా బెదిరించారని అన్నారు. సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ జానీ బెదిరించారన్న పోలీసులు, పలుకుబడితో బాధితురాలికి అవకాశాలు రాకుండా చేశారని తెలిపారు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని వివరించారు. అటు జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
Jani Master Issue: తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నార్సింగి ఠాణాకు బదిలీ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించిన పోలీసులు యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి లైంగిక దాడి జరుగుతున్నట్లు నిర్థారించుకుని ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా పోక్సో సెక్షన్‌ను చేర్చారు.