Jagananna Videshi Vidya Scheme:పేరు గొప్ప, ఊరు దిబ్బ ఇదీ జగన్ విధానం. మాటలు కోటలు దాటినా చేతలు మాత్రం గడప దాటవు. అధికారంలోకి రాగానే ప్రచార పిచ్చితో పథకాలకు తన పేర్లు పెట్టుకున్నారు. దీనజన బాంధవుడిలా పోజులు కొట్టారు. ఆచరణలోకి వచ్చే సరికి చేతులెత్తేశారు. విదేశీ విద్య అమల్లోనూ అదే జరిగింది. చంద్రబాబు తెచ్చిన పథకానికి అంబేడ్కర్ పేరు పెడితే జగన్ అధికారంలోకి వచ్చాక తీసిపారేశారు. అనేక ఒత్తిళ్లతో మూడేళ్ల తర్వాత జగన్ విదేశీ విద్యాదీవెనగా పేరు మార్చేసి అమల్లోకి తెచ్చినా నిబంధనల కత్తి ఝుళిపించారు.
పేదింటి బిడ్డల ఉన్నత చదువుల కోసం తాపత్రయపడుతున్నట్లు జగన్ చెప్పిన తియ్యటి మాటలు వెనుక ఎంతటి విషం దాగుందో చేతల్లోకి వచ్చాక గానీ అర్థం కాలేదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారిలో అత్యధికులు మిడ్‌రేంజ్ వర్సిటీలను ఎంచుకుంటూ ఉంటారు. ఇలాగైతే ఎక్కువ మందికి సాయం చేయాల్సి వస్తుందనే భావనతో నిబంధనల కత్తిని బయటికి తీశారు. ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలంటే సబ్జెక్టుల వారీగా టాప్-50 ర్యాంకు ఉన్న వర్సిటీలకు ఎంపిక కావాలని రూల్ పెట్టారు.
ఏటా విదేశాల్లో ఉన్నత విద్యకు రాష్ట్రం నుంచి వెళ్తున్న విద్యార్థుల్లో ప్రభుత్వం పేర్కొన్న టాప్ వర్సిటీలకు ఎంపికయ్యేవారు ఒక శాతానికి మించరు. అందులోనూ పేద, మధ్యతరగతి విద్యార్థుల సంఖ్య అంతకంటే తక్కువే. అంటే పేద, మధ్యతరగతి వర్గాలకు కుట్రపూరితంగా పథకాన్ని దూరం చేశారు. ఇక మెరిట్ విద్యార్థులకైతే టాప్ వర్సిటీలే ఉపకార వేతనాలు ఇస్తాయి. విద్యారుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. అలాంటి వారికి ప్రభుత్వం చేసే సాయం ఏముంది?.]
అద్భుతంగా అమలు చేశామంటున్న విదేశీ విద్యాదీవెనకు గత ఐదేళ్లలో ఒకే ఒక్క ఎస్టీ విద్యార్థి ఎంపికయ్యారు. ఎస్సీ విద్యార్థుల సంఖ్య 50 లోపే. అన్నివర్గాల వారి లెక్క తీసినా 390 మందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ కంటే 12 రెట్లు ఎక్కువగా 4వేల 923 మందికి విదేశీ విద్య కింద సాయం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అయినా ఉపముఖ్యమంత్రి పదవులు, మంత్రి హోదాలు వెలగబెట్టిన ఏ ఒక్క వైఎస్సార్సీపీ ఎస్సీ నాయకుడు కూడా దీనిపై ఎప్పుడూ నోరెత్తలేదు. విదేశీ విద్యాదీవెనకు ఉన్న అంబేడ్కర్ పేరుని తీసేసి దర్జాగా జగన్ తన పేరు పెట్టుకున్నా అమాత్యుల మాట పెగల్లేదు.