Jagan Government Failed to Attract Investments:రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నాయి. పారిశ్రామిక, పర్యాటక, ఆక్వా తదితర రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. కానీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో మాత్రం రాష్ట్రం వెనకబడింది. ఏ చిన్న అవకాశం ఉన్నా పెట్టుబడులు పెడతామంటూ పోటీలు పడే పారిశ్రామిక వేత్తలు మన దగ్గరకు ఎందుకు రావడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు మన దగ్గర ఈ దౌర్భాగ్యానికి కారణం సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్. ఆయన నేతృత్వంలోని వైసీపీ సర్కారు అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాలు, మౌలిక సదుపాయాల విస్మరణ, కమీషన్ల కక్కుర్తి ఫలితంగా ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
కనీసం గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిపై ఈ ప్రభుత్వం దృష్టిసారించినా మనకూ ఒక మహానగరం సాకారమయ్యేది. అదీ చేయకపోవడంతో, అపార అవకాశాలున్న మనరాష్ట్రాన్ని కాదని పెట్టుబడులన్నీ తరలిపోయాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవయ్యాయి. ఫలితంగా ఉన్నత చదువులతో పాటు కొలువులకూ యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఒకప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టాప్-10 జాబితాలో స్థానం కోల్పోయింది. ఈ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బంగాల్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు సైతం ముందు వరసలో ఉన్నాయి. తెలంగాణ కూడా మెరుగైన స్థానంలోనే ఉంది.
'వైసీపీ పాలనంతా అప్పులమయమే - అప్పు చేస్తే గానీ ప్రభుత్వం నడవని పరిస్థితి'
13వ స్థానంలో ఆంధ్రప్రదేశ్:ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు 65 వేల 502 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మహారాష్ట్ర జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దిల్లీ 25వేల 582 కోట్లు, కర్ణాటక 23వేల 460 కోట్లు, గుజరాత్ 18వేల 884 కోట్ల విదేశీ పెట్టుబడులతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయిదారు స్థానాల్లో తమిళనాడు 11వేల 115 కోట్లు, తెలంగాణ 9వేల 679 కోట్లతో ఉన్నాయి. కేవలం 630 కోట్ల విదేశీ పెట్టుబడులను సంపాదించిన ఆంధ్రప్రదేశ్ మాత్రం 11వ స్థానంలో నిలిచింది.
2019 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు నెలాఖరు వరకు ఎఫ్‌డీఐ గణాంకాలను పరిశీలిస్తే మనం ఎంత వెనకబడ్డామో స్పష్టమవుతుంది. మహారాష్ట్ర 4లక్షల 72వేల 829 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను సాధించి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో కర్ణాటక 3లక్షల 58 వేల 517 కోట్లు, తృతీయ స్థానంలో గుజరాత్ 2లక్షల 57వేల 908 కోట్లతో ఉన్నాయి. 45వేల 445 కోట్ల పెట్టుబడులతో తెలంగాణ 7వ స్థానంలో ఉంటే 6వేల 679 కోట్లతో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది.