Jagan Fraud Gudivada Tidco House Beneficiaries: గుడివాడలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు జగన్ కుచ్చుటోపీ పెట్టారు. తాము అధికారం చేపడితే టిడ్కో ఇళ్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టారు. షరా మామూలుగా మడమ తిప్పారు. తీరా ఎన్నికల వేళ మరోసారి లబ్ధిదారులను మభ్యపెట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు యత్నిస్తున్నారు. మరోవైపు ఐదేళ్ల పాలనలో కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించలేదని లబ్ధిదారులువాపోతున్నారు.
అరకొర వసతులతో టిడ్కో ఇళ్లు పంపిణీ - సమస్యలు, అనారోగ్యం ఇక్కట్లతో ప్రజలు - Tidco Houses
Tidco Houses in TDP Governament: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గుడివాడ మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో 220 బ్లాకులుగా టిడ్కో ఇళ్లను నిర్మించారు. జీ ప్లస్ త్రీ నమూనాలో 300, 365, 430 చదరపు అడుగుల్లో మూడు కేటగిరీల్లో గృహాలు నిర్మించారు. 365 చదరపు అడుగుల గృహానికి 7.55 లక్షలు, 430 చదరపు అడుగుల గృహానికి 8.5 లక్షల చొప్పున లబ్ధిదారులు బ్యాంకులకు రుణం చెల్లించాల్సి ఉంది.
టిడ్కో ఇళ్ల రుణ మాఫీపై మాట మార్చిన జగన్: టిడ్కో ఇళ్లపై ఆర్థికభారం మోపుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి, టిడ్కో ఇళ్లు ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత టిడ్కోరుణ విముక్తులను చేస్తామని అవసరమైతే వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తయ్యి మళ్లీ ఎన్నికలు కూడా వస్తున్నా నేటి వరకూ వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఊసెత్తలేదని టిడ్కో లబ్ధిదారులు వాపోతున్నారు.