Jagan and YSRCP MLA and MLCs In Assembly Meeting :ఈ రోజుఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే ఇక చాల్లే పోదం పదండి అన్నట్లు వైఎస్సార్సీపీ సభ్యులతో కలసి బయటకు వచ్చేశారు. ఉన్న కొద్దిసేపు గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలోనూ సభలో గందరగోళం సృష్టించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు యత్నించారు. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యుల నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొద్దిసేపు సాగింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి విచ్చేసిన గవర్నర్ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సభకు గైర్హాజరు అయితే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వారు సభకు హాజరయ్యారని కూటమి నేతలు విమర్శించారు.