ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐటీ ఎగుమతుల్లో కనీసం ఒక్క శాతం కూడా ఏపీ నుంచి లేవు - ఈ దుస్థితికి కారణం ఎవరు? - IT Sector in Andhra Pradesh

IT Sector Development in Andhra Pradesh: వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్‌ సాఫీగా దిగుతుంది. లేదంటే గాల్లో చక్కర్లు కొట్టి ఎక్కడో అనుకూలంగా ఉన్నచోట వాలిపోతుంది! తెలుగురాష్ట్రాల్లో ఐటీ పెట్టుబడుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. దిగ్గజ కంపెనీలే కాదు చిన్నా చితకా స్టార్టప్‌లూ ఏపీ అంటే అమ్మో అంటున్నాయి. నేరుగా తెలంగాణలో వాలిపోతున్నాయి! పాత పరిశ్రమలు పారిపోతుంటే వైసీపీ సర్కార్‌ విధ్వంసక వాతావరణంలోకి కొత్తగా అడుగుపెట్టలేమంటూ కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో కనీసం ఒక్క శాతం కూడా ఏపీ నుంచి లేకపోవడం నవ్యాంద్ర దుర్గతికి నిదర్శనం.

IT_Sector_Development_in_Andhra_Pradesh
IT_Sector_Development_in_Andhra_Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 7:13 AM IST

తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో కనీసం ఒక్క శాతం కూడా ఏపీ నుంచి లేవు - ఈ దుస్థితికి కారణం ఎవరు?

IT Sector Development in Andhra Pradesh: తెలంగాణలో ఎల్లల్లేకుండా సాగుతున్న ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి ప్రతిరూపాలు ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్ ఐటీ టవర్స్! 1997లో హైదరాబాద్‌ కేంద్రంగా మొదలైన తెలంగాణ ఐటీ ప్రయాణం, ఇప్పుడు ఖమ్మం, కరీనంగర్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, ఇలా ఒకటేంటి? తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించింది. మరి ఏపీలో కనీసం విశాఖ, విజయవాడ వంటి ప్రథమ శ్రేణి నగరాల్లోనైనా ఇలాంటి ఐటీ వెలుగులున్నాయా? పోనీ భవిష్యత్‌లో వస్తాయా? ఆ నమ్మకం ఆవగింజంతైనా కనిపించడంలేదు. రాష్ట్రంలో ఐటీ రంగం పరిస్థితి అథఃపాతాళానికి దిగజారుతోంది. తెలంగాణ మాత్రం ఒక్కోమెట్టూ ఎగబాకుతూ సరికొత్త శిఖరాలు అందుకుంటోంది.

ఎగుమతుల్లో మనమెక్కడ:రాష్ట్ర విభజననాటికి, అంటే 2013-14లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్ల రూపాయలు. అక్కడ పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 3లక్షల 23 వేలు. 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2లక్షల 41వేల 275 కోట్లు! ఉద్యోగుల సంఖ్య 9లక్షల 5వేలు! కానీ ఏపీలో ఇప్పుడు ఐటీ ఎగుమతుల లెక్కలు చెప్పేవారేలేరు. 2021-22లో ఏపీ నుంచి ఐటీ ఎగుమతులు 926 కోట్ల రూపాయలని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ బదులిచ్చారు. అంటే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో, కనీసం ఒక్క శాతమైనా ఏపీ నుంచి జరగడంలేదు. దానికి కారణంతెలంగాణలో ఐటీని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటే, మన దగ్గర అంతకంతకూ నిరుత్సాహ పరుస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం సుమారు 1,500 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలున్నాయి. 2016లో 400 స్టార్టప్‌లుంటే 2022నాటికి రెండు వేలకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో వచ్చే ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌కు వస్తోంది. సాధారణంగా డేటా సెంటర్లు కోస్తా తీరాల్లో ఏర్పాటవుతాయి. సముద్రగర్భకేబుల్‌ అనుసంధానత వంటి సానుకూలాంశాలు దానికి దోహదం చేస్తాయి. ఏపీకి సుదీర్ఘ తీరప్రాంత ఉన్నా డేటా సెంటర్లు ఇటు వైపు చూడడంలేదు. హైదరాబాద్‌ తీర ప్రాంతం కాకపోయినాఅంతర్జాతీయ క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అక్కడ కేంద్రాలు నెలకొల్పుతున్నారు. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లు రంగారెడ్డి జిల్లా చందనవెల్లి, ఫ్యాబ్‌సిటీ, ఫార్మాసిటీల్లో డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి.

బిమారు రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబాటు - ఐటీ రంగంలో అధమ స్థానంలో రాష్ట్రం

దావోస్‌ దరిదాపుల్లోకి వెళ్లలేదు: తెలంగాణ ఐటీ రంగానికి బలమైన పునాది 1997లోనే అప్పటి సీఎం చంద్రబాబు చేతులమీదుగా పడింది! 14 నెలల్లోనే సైబర్‌ టవర్స్‌ నిర్మించారు. బిల్‌గేట్స్‌ను మెప్పించారు, మైక్రోసాఫ్ట్‌ను రప్పించారు. ఆ తర్వాత మానవ వనరులు, మౌలిక వసతుల కల్పనకూ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత అగ్రశ్రేణి కంపెనీలన్నీ ఒకదానివెంట మరొకటి హైదరాబాద్‌లో రెక్కలు కట్టుకుని వాలాయి. ఆ తర్వాతి ప్రభుత్వాలూ ఆ సానుకూల వాతావరణాన్ని చెడగొట్టకుండా కొనసాగించాయి. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్​ఎస్ ప్రభుత్వం కూడా టీ-హబ్, వీ హబ్, టీ వర్క్స్‌ యూత్‌ హబ్, టీఎస్‌ఐటీ తదితర కేంద్రాల్ని నెలకొల్పి యువతను ఆవిష్కరణలవైపు ప్రోత్సహించింది.

ఏటా దావోస్‌ వెళ్లి పెట్టుబడుల్ని ఆకర్షించింది. బీఆర్​ఎస్ దిగిపోయి కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఆ సంప్రదాయం కొనసాగించింది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇటీవలే దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లి కొత్త కంపెనీల్ని రాష్ట్రానికి ఆహ్వానించారు. కానీ మన సీఎం దావోస్‌ దరిదాపుల్లోకి వెళ్లలేదు! తాడేపల్లి ప్యాలెస్‌ దాటలేదు. పోనీ మన ఐటీ మంత్రైనా వెళ్లారా అంటే! ఆయన పెట్టుబడుల గుడ్లు ఎప్పుడు పొదుగుతాయా అని చూస్తూ ఇక్కడే ఉండిపోయారు. గతేడాది ఏకంగా దావోస్‌లో చలి అంటూ సాకు చెప్పారు.

ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం

గత ప్రభుత్వం ఏం చేసిందంటే:రాష్ట్ర విభజన తర్వాత సుమారు 95 శాతానికిపైగా ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నచిన్న కంపెనీలే మిగిలాయి. అప్పటికి విశాఖలోనే ఓ మాదిరి ఐటీ రంగం అభివృద్ధి చెందింది. విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడం, ఐటీ కంపెనీల ఏర్పాటుకు మౌలిక వసతులు కొరవడటం, అనువైన వాతావరణం లేకపోవడం వంటివి ప్రధాన అవరోధాలయ్యాయి! 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త పాలసీలతో సానుకూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. ఐటీ సంస్థ కొత్తగా కంపెనీ ప్రారంభించాలంటే ఒక్కో సీటుపై 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టాలి. డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్స్‌ విధానంలో భాగంగా ఆ ఖర్చులో సగం అప్పటి టీడీపీ ప్రభుత్వం భరించింది.

ప్రభుత్వమే భవనాల్ని అద్దెకు తీసుకుని రాయితీపై కంపెనీలకు అందజేసేది. ఐటీ ఉద్యోగులకు వారి జీతంలో గరిష్టంగా 12వేల వరకూ ప్రభుత్వం చెల్లించింది. వైసీపీ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసేసింది. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని అంతకుముందు సంవత్సరానికి కనీసం రూ.500 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకే ఇచ్చేవారు. పెద్ద కంపెనీలకే ఆ కాంట్రాక్టులు అందేవి! టీడీపీ ప్రభుత్వం ఈ విధానం మార్చేసింది. లక్ష రూపాయల పని ఇవ్వాలంటే 3 లక్షల రూపాయల టర్నోవర్‌ ఉంటే చాలని నిబంధన తెచ్చింది! దాని వల్ల ప్రభుత్వ కాంట్రాక్టులు దొరుకుతాయనే ఉద్దేశంతో చిన్న కంపెనీలూ ఏపీకి రావడం మొదలైంది. రాయితీ కోసం కంపెనీలు ప్రభుత్వం చుట్టూ తిరిగే విధానం స్థానంలో అవి కల్పించే ఉద్యోగాల ఆధారంగా రాయితీలిచ్చే ప్రక్రియకు నాంది పలికింది.

ఐటీ కంపెనీలకు 21 రోజుల్లోనే భూకేటాయింపుల విధానం తెచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక విధ్వంసకర చర్యలే తప్ప ఐటీ రంగం అభివృద్ధికి చూపిన చొరవేమీ లేదు. గత ప్రభుత్వం అమలుచేసిన డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్స్‌ పాలసీని రద్దు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఆగిపోవడంతో విశాఖ, విజయవాడ, గుంటూరువంటి ప్రాంతాల్లో ఏర్పాటైన చిన్న కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఒక్క విశాఖలోనే వంద స్టార్టప్స్‌ మూతపడ్డాయి. ఆ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలనూ ఇవ్వలేదు. 400 మంది ఉద్యోగులున్న ఐబీఎమ్, 3వేల 500 మంది ఉద్యోగులున్న హెచ్​ఎస్​బీసీ వెళ్లిపోయాయి. తెలుగుదేశం హయాంలో 70 వేలకోట్లు పెట్టుబడి పెడాతామన్న అదానీ సంస్థ వైసీపీ అధికారంలోకి వచ్చాక 22 వేల కోట్ల రూపాయలకు కుదించుకుంది. సామర్థ్యాన్ని 5గిగావాట్లకు బదులు 300 మెగావాట్లకు తగ్గించింది. టీడీపీ హయాంలో విజయవాడలో భారీ విస్తరణ ప్రణాళికతో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్​సీఎల్ సంస్థ గన్నవరంలోని తమ సెంటర్‌ను వైసీపీ హయాంలో చిన్న బీపీఓ కేంద్రం స్థాయికి పరిమితం చేసింది.

సీఎం పర్యటనతో ఐటీ ఉద్యోగులకు ముచ్చెమటలు - ఐటీ జోన్, పొలిటికల్‌ యాక్టివిటీ మిలీనియం టవర్స్​లోనే?

గత ప్రభుత్వ హయాంలో పురోగతి: తెలుగుదేశం హయాంలో ఐటీ రంగంలో ఏపీకి 36 వేల 583 ఉద్యోగాలు వచ్చాయి. మరో 40 వేల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి! ఇండియా బీపీఓ స్కీం ద్వారా మరో 19 వేల 380 ఉద్యోగాలు వచ్చాయి. విజయవాడలో హెచ్​సీఎల్, పైడేటా సెంటర్‌ వంటి కంపెనీలు ఏర్పాటయ్యాయి. మేధాటవర్‌ ఐటీ కంపెనీలతో కిక్కిరిసింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్, కాండ్యుయెంట్, ఏఎన్​ఎస్​ఆర్ వంటి కంపెనీలూ వచ్చాయి. పేటీఎం, బెల్‌ఫ్రిక్స్, ఫెడరల్‌ బ్యాంక్, అంజూర్‌ వంటి 21 కంపెనీల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

APNRT సహకారంతో మంగళగిరి, విజయవాడ, గుంటూరు, విశాఖలో 93 కంపెనీలు, వాటిలో ఆరు వేల ఉద్యోగాలు వచ్చాయి. తిరుపతికి జోహో కంపెనీ కూడా వచ్చింది. వైసీపీ హయాంలో విశాఖలో ఇన్ఫోసిస్‌ ఇటీవలే కార్యాలయం ప్రారంభించింది. అదేదో తమ ఘనతగా జగన్‌ ప్రభుత్వం ఊదరగొడుతోంది. కరోనా సమయం నుంచి వర్క్‌ఫ్రంహోంలో ఉంటున్న ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు రప్పించే లక్ష్యంతో విశాఖతోపాటు నాగ్‌పుర్, కోయంబత్తూరు, భోపాల్‌ నగరాల్లో ఇన్ఫోసిస్‌ తమ కేంద్రాల్ని ఏర్పాటుచేస్తోంది.

విశాఖకూ ఇన్ఫోసిస్‌ అలా తన అవసరాల కోసం వచ్చిందే తప్ప ప్రభుత్వ చొరవతో కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో 200 మందితో ఉబర్, 200 మందితో రాన్‌స్టాడ్, 150 మందితో కంట్రాన్, 10నుంచి 20 మందితో అమెజాన్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అవీ వాటంతట అవి వచ్చినవే. ఉన్న కంపెనీల్ని వెళ్లగొట్టడం, కొత్త కంపెనీలు రాకపోవడంతో రాష్ట్రంలో ఐటీ రంగం వెలుగులు మసకబారుతున్నాయి.

IT Sector in AP: అంకురాలను చిదిమేసిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో జాడలేని ఐటీ రంగం

ABOUT THE AUTHOR

...view details