ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రాండ్ ఏపీ కోసం మంత్రి లోకేశ్ కృషి - పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్

ముగిసిన మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - 100కుపైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు

Nara Lokesh America Tour Completed
Nara Lokesh America Tour Completed (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Nara Lokesh America Tour Completed: గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో దారి తప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టే దిశగా సాగిన ఐటీ మంత్రి నారా మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జరిగిన వారం రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో శుభవార్త చెప్తామనే సంకేతాలు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించే యత్నం :ఐదేళ్ల విధ్వంసక పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా లోకేశ్ అమెరికా పర్యటన దిగ్విజయంగా సాగింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు నిర్వహించారు. గత నెల 25న అమెరికా పర్యటనకు వెళ్లిన లోకేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.

దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్ విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూప్, రేవేచర్, సేల్స్ ఫోర్స్, ఫాల్కన్ ఎక్స్, ఈక్వెనెక్స్, జడ్ స్కాలర్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. గత నెల 29న లాస్ వేగాస్ లో 23దేశాల నుంచి 2వేల300 చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు హాజరైన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ కు విశిష్ట అతిధిగా హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించారు. ఏపీపై గత ఐదేళ్లుగా నెలకొన్న దురభిప్రాయాన్ని తొలగించి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించే యత్నం చేశారు.

గూగుల్ క్లౌడ్ సీఈవోతో లోకేశ్ భేటీ - విశాఖలో డాటా సెంటర్ల ఏర్పాటుపై ఫోకస్

ఏపీని ఒకసారి సందర్శించాలని విజ్ఞప్తి :పర్యటన చివరి రోజూ న్యూయార్క్​లోని విట్ బై హోటల్​లో పారిశ్రామికవేత్తలు, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. బ్లూప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పని చేస్తోందని తెలిపారు. 974 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ ఏపీలో అందుబాటులో ఉందని వివరించారు.

రాబోయే 18 నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని, దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు. మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి నిపుణులు తయారవుతారని వివరించారు. పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా లోకేశ్ అమెరికా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

'ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్'​లో పాల్గొన్న మంత్రి లోకేశ్ - ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కసరత్తు

ఫాక్స్ కాన్ సిటీ ఏర్పాటు :గత పాలకుల అరాచకాలు తట్టుకోలేక రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలను మళ్లీ ఏపీకి తెచ్చేందుకు లోకేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు పలు దఫాలు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులతో లోకేశ్ చర్చించారు. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీఎస్ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సిటీని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడకు వచ్చిన హెచ్​సీఎల్ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యాక, మరో 15వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది.

పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్ : అమెరికా పర్యటన ద్వారా పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై లోకేశ్ విశ్వాసం కలిగించారు. ఆయన ప్రతిపాదనలపై దిగ్గజ కంపెనీలు సైతం సానుకూల సంకేతాలిచ్చాయి. 2025 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యాన దావోస్​లో జరిగే పెట్టుబడుల సమావేశం నాటికి లోకేశ్ చేసిన తొలి ప్రయత్నం సత్ఫలితాలనిచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బ్రాండ్ ఏపీ కోసం లోకేశ్ చేస్తోన్న కృషి పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్ నెలకొంది.

గుడ్ న్యూస్ - త్వరలో విశాఖకు ఏవియేషన్‌ వర్సిటీ, డాటా సెంటర్‌!

ABOUT THE AUTHOR

...view details