Isolation Wards Set up in Gandhi due to HMPV Alert :దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. ఆసుపత్రి ప్రధాన భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో 40 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరిండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. వాటిలో పురుషులకు 15, మహిళలకు 5, పిల్లలకు 20 పడకలు కేటాయించింది. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా అంత ప్రమాదం కాదని, సాధారణ ఇన్ఫ్లూయెంజా మాత్రమేనని, వెంటనే వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇటువంటి వైరస్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి వైద్యనిపుణులు తెలిపారు.
ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురవలసిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. నివారణ చర్యలు తీసుకుంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు ఈ వైరస్‌తో ఒక్క మరణం కూడా సంభవించలేదని అన్నారు. కొవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో 600 ఆక్సిజన్ పడకలు, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, సుమారు 40 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
HMPV కేసులపై ప్రభుత్వం అప్రమత్తం - అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాగ్రత్తలు!
"ఈ వ్యాధి అంత ప్రమాదకరమైంది కాదు. నవంబరు, డిసెంబరులో సాధారణంగా వచ్చే ఇన్ఫ్లూయెంజా. ప్రజలు మాస్క్ పెట్టుకోవాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కకేసు నమోదు కాలేదు. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం."- సునీల్ కుమార్, గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్