Ismailkhanpet Durga Temple In Sangareddy: సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో కాకతీయుల కాలం నాటి కోటలో దుర్గాదేవి గుడి నవరాత్రుల సమయంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆరు ఎకరాల్లో స్థానికులు గడీగా పిలుచుకునే కోట ఉంది. దాంట్లో గ్రామస్థులు ఏడు ప్రకారాలతో దుర్గాదేవి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని దేదీప్యమానంగా అమ్మవారికి పూజలందిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ మెుక్కులు తీర్చుకుంటున్నారు.
ఇక్కడ దుర్గామాత దేవాలయాన్ని 2001లో గ్రామస్థులే ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల 23వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం రోజున పూర్ణాహుతి అనంతరం సూర్యాస్తమయంలో లక్షదీపోత్సవం చేశారు. రెండు నిమిషాల్లో లక్షదీపాలు వెలిగించి అమ్మవారికి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో నవచండీ మహాయాగం ఇక్కడ మరో ప్రత్యేకత.
ఆలయ నిర్మాణానికి పూర్వం గడి అని పిలవబడే కోటలో వాయువ్య భాగంలో శివాని మాత మందిరం గత 300 సంవత్సరాల నుంచి ఉన్నట్లుగా గ్రామస్తుల నమ్మకం. దేవస్థాన ఏర్పాటుకు ముందు అప్పటి ప్రభుత్వం ఇక్కడ పోలీస్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు ఈ గడీలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శాఖ కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పట్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారు ఇంత పెద్ద కోట ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తే గ్రామంలో మంచి స్థలం దూరమవుతుందన్న ఉద్దేశ్యంతో గ్రామస్తుల సహాయంతో దుర్గాభవాని మాత ఆలయం నిర్మించారు.