ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబుళాపురం దోచేశారు- సీబీఐ సీజ్‌ చేసిన ఇనుప ఖనిజం, వాహనాలు మాయం - YSRCP Iron ore Smuggling - YSRCP IRON ORE SMUGGLING

Iron ore Smuggling in Anantapur District : ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లోని వివాదాస్పద ఓబుళాపురం గనుల్లో దొంగలు పడ్డారు. గతంలో సీబీఐ సీజ్‌ చేసిన ఇనుప ఖనిజాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండతో దోచేశారు. అడిగే వారు లేరని, అడ్డుకునేవారు రారన్న ధైర్యంతో క్వారీల్లోకి రాచమార్గాలు వేసుకొని మరీ రేయింబవళ్లూ తరలించారు. సీబీఐ సీజ్‌ చేసిన టిప్పర్లు, పొక్లెయిన్ల వంటి వాహనాలను సైతం తుక్కుగా మార్చి అమ్మేసుకున్నారు. ఏకంగా లక్ష టన్నుల ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ స్టీల్‌ ప్లాంట్లకు విక్రయించి జేబులు నింపుకొన్నారు.

YSRCP Leaders Iron ore Smuggling
YSRCP Leaders Iron ore Smuggling (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 3:38 PM IST

YSRCP Leaders Iron ore Smuggling : అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం ఓబుళాపురం పరిధిలో, ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ పేరుతో గాలి జనార్ధన్​రెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంతో గతంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011లో ఓబుళాపురం పరిధిలోని 8 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్‌ చేసింది. ఆ ప్రాంతంలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఆ పార్టీ నాయకుల కన్ను ఆ ఇనుప ఖనిజంపై పడింది.

రూ.30 కోట్ల విలువైన ఖనిజం మాయం : ఈ క్రమంలోనే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజాన్ని కొద్దికొద్దిగా బయటకు తరలించారు. ఓబుళాపురం సమీపంలోని స్పాంజ్‌ ఐరన్, స్టీల్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని దొంగిలించిన ఖనిజాన్ని వారికి విక్రయించారు. 2024 మార్చి వరకూ ఈ చోరీ ప్రక్రియ దఫదఫాలుగా సాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇనుప ఖనిజం ధర టన్ను రూ.3,000లు పలుకుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో లక్ష టన్నులకు పైనే ఖనిజం చోరీ అయినట్లు సమాచారం. ఈ లెక్కన రూ.30 కోట్ల విలువైన సంపద మాయమైనట్లు అంచనా. దీంతో పాటు అప్పట్లో సీబీఐ సీజ్‌ చేసిన మైనింగ్‌ యంత్రాలు, వాహనాలను కూడా తుక్కుగా మార్చి రూ.4 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.

కీలక నేత కనుసన్నల్లోనే :ఇటీవలి వరకు రాయదుర్గం ప్రజాప్రతినిధిగా ఉన్న కీలక నేత కనుసన్నల్లోనే ఓబుళాపురంలో ఇనుప ఖనిజం చోరీ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేత అప్పట్లో ఓఎంసీలో కీలకంగా వ్యవహరించారు. అతని కుమారుడు ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని సీబీఐ సీజ్‌ చేసిన ఇనుమును ప్రైవేట్ స్టీల్‌ ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకూ వైఎస్సార్సీపీలో కొనసాగిన ఆ నేత ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారు.

Obulapuram Mines Issue Updates :ఈ వ్యవహారంలో సీబీఐ నిర్లక్ష్యం కూడా వెలుగులోకి వచ్చింది. సీజ్‌ చేసిన ఖనిజానికి ఓఎంసీ సిబ్బందినే కాపలా పెట్టింది. దొంగ చేతికే తాళాలిచ్చిన చందంగా వారి మనుషులే కాపలాగా ఉండటంతో దోపిడీ యథేచ్ఛగా సాగింది. పైగా వారు కూడా కోట్ల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఓ కీలక నేత 2019-24 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాయదుర్గం ప్రాంతంలో భారీగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. బొమ్మనహాళ్‌ మండల పరిధి నేమకల్లు కంకర క్వారీల్లో అనుమతుల్లేకుండా గనులు తవ్వి ప్రకృతి సంపదను దోచుకున్నారు. తమ క్వారీలను సైతం ఆయన ఆక్రమించుకున్నారని కొందరు లీజుదారులు ఫిర్యాదు చేసినా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

కోర్టు ఉత్తర్వులు బేఖాతరు : ఓబుళాపురం పరిధిలో సీబీఐ సీజ్‌ చేసిన ఖనిజాన్ని దొంగిలిస్తున్నారని, స్థానిక టీడీపీ నాయకులతో పాటు ఓఎంసీ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న టప్పాల్‌ శ్యాంప్రసాద్ డి.హీరేహాళ్​ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై వెంటనే కేసు నమోదు చేయలేదు. దీంతో శ్యాంప్రసాద్‌ రాయదుర్గం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అప్పటి డి.హీరేహాళ్‌ ఎస్సై రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టాలని నాటి సీఐ యుగంధర్‌ను ఆదేశించింది. చివరకు సీఐ కూడా కోర్టు ఆదేశాలను పాటించలేదు.

దీనిపై శ్యాంప్రసాద్‌ ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐకి ఫిర్యాదులు అందినా నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎవరూ రంగంలోకి దిగలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దలను సైతం ప్రభావితం చేశారన్న అభియోగాలున్నాయి. ఇనుప ఖనిజం చోరీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

'ఓబుళాపురం'లో 1.74 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం!

ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసు.. ఎండీకి నాలుగేళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details