IPS Transfers in Telangana : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. ఈ క్రమంలో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు.
ప్రస్తుతం రైల్వే డీజీగా ఉన్న మహేశ్ భగవత్‌ను లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా నియమించింది. పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్ డీజీగా స్వాతి లక్రా బదిలీ అయ్యారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయనకు అదనపు బాధ్యతలుగా పోలీసు సంక్షేమం, క్రీడల ఏడీజీగా నియమించారు. గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ అదనపు డీజీగా స్టీఫెన్ రవీంద్ర, తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్ అదనపు డీజీగా సంజయ్‌కుమార్ జైన్, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించింది.
ప్రస్తుతం రాచకొండ సీపీగా ఉన్న తరుణ్ జోషీని ఏసీబీ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్ 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్, రైల్వే ఐజీగా కె.రమేశ్ నాయుడు, మల్టీజోన్ 2 ఐజీగా వి.సత్యనారాయణ, హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితా మూర్తి, మెదక్ ఎస్పీగా ఉదయ్‌కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, హైదరాబాద్ తూర్పు మండల డీసీపీగా బాలస్వామిని నియమించింది. నైరుతి మండల డీసీపీగా చంద్రమోహన్‌ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.