Young Doctor Did PhD on Covid:అందరిలా వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అయ్యి, కెరీర్‌లో స్థిరపడాలన్నదే ఈ యువతి లక్ష్యం కాదు. అంతకుమించి తానేంటో నిరూపించాలనుకుంది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలపై పరిశోధన చేసింది. ఆ నివేదకలు ప్రపంచ సదస్సుల్లో సమర్పించి, భారత్‌కు పేరు తీసుకొచ్చింది. ఈ తరహాలో పరిశోధ చేసి అంతర్జాతీయ ఖ్యాతిగడించిన అతి తక్కువ మంది భారతీయులలో తాను ఒకరిగా నిలిచింది.
కోవూరి ఉమాదేవి స్వస్థలం హైదరాబాద్‌లోని మియాపూర్. పదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోగా.. తల్లి, మామయ్య బాధ్యతలు తీసుకున్నారు. మొదట్నుంచీ ఇంట్లో చదువుకు అధిక ప్రాధాన్యం ఉండటంతో చిన్నప్పుడే చదువుపై ఆసక్తి కనబరిచింది. మామయ్య ప్రోత్సాహంతో తెలుగు శతకాలు సాధన చేసింది. 108 పద్యాలు 7 నిమిషాల్లో చెప్పి.. ప్రశంసలు అందుకుంది.
'డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాను. ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడే పాథాలజీ మీద ఆసక్తి పెరిగింది. 2020లో నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో పీజీ సీటు సాధించింది. అక్కడ చేరిన తర్వాత రెండేళ్లూ కరోనాలోనే గడిచి పోయింది. ఆ సమయంలో చాలా మంది చనిపోవడం బాధగా అనిపించేది. అప్పుడే కొవిడ్ మీద పరిశోధన చెయ్యాలని నిర్ణయించుకున్నాను. పీజీలో కొవిడ్ మీదనే థీసిస్ కూడా సమర్పించాను.'-డా.కే.ఉమాదేవి, పరిశోధకురాలు
పాథాలజిస్ట్‌గా చేస్తూనే పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ చేస్తూ రీసెర్చ్ పైనా దృష్టి పెట్టింది ఉమాదేవి. కొవిడ్‌పై చేసిన పరిశోధనల గురించి తెలంగాణ స్టేట్ ఛాప్టర్‌లో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చింది . అందులో మొదటి అవార్డు రావడంతో పరిశోధనపై మరింత ఉత్సాహం పెరిగింది. వైద్యరంగానికి ఉపయోగపడే ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతపై పని చేసింది. టెరాహెడ్స్ ఇమేజింగ్ ఫర్ డీటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్, నానో మెటీరియల్స్, నానో టెక్నాలజీ మీద గత రెండేళ్లుగా బృందంతో కలిసి పని చేస్తోంది.
YUVA : 14 ఏళ్ల వయసులో 45 ఫ్రాక్చర్లు - అయితేనేం అంటూ దూసుకెళ్తున్న విజయ దీపిక - Table Tennis Player Vijaya Deepika
ఇంటర్నెట్‌లో పరిశోధనల గురించి శోధించగా యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ గురించి తెలుసుకుంది ఉమాదేవి. పరిశోధన వివరాలను వారికి పంపగా.. మార్చి 6 నుంచి 9 తేది వరకు టర్కీలో జరిగిన సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానం అందుకుంది. కొవిడ్ వచ్చిన వాళ్లలో ఆస్తమా ఉన్న వాళ్లు, లేని వాళ్ల మీద ఎలాంటి ప్రభావం ఉందన్న అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సదస్సుకు వెళ్లడానికి ఐసీఎమ్ఆర్ నుంచి 86వేలు ఆర్థిక సాయం పొందింది ఈ యువతి.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఈ ఏడాది మే 26 నుంచి 30వరకు ECS సదస్సు జరిగింది. ఎలక్ట్రో కెమికల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు తమ పరిశోధనలను ఈ సదస్సులో సమర్పిస్తారు. తాను కూడా కొలెస్ట్రిన్ డిటెక్షన్, గ్రాఫిన్, డ్రగ్ డెలివరీ సిస్టం వంటి అంశాలపై చేసిన పరిశోధన పత్రాలు ఈసీఎస్‌లో సమర్పించింది. అయితే ఈ సదస్సుకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం అందించింది.
యూరోపియన్, అమెరికా దేశాల్లో జరిగిన సదస్సులో దేశం నుంచి వైద్యురాలుగా ఉమాదేవి కి మాత్రమే అవకాశం లభించింది. ఇవేకాకుండా ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో టెరాహెడ్స్ ఇమేజింగ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే అంశంపై సదస్సులో పాల్గొని ప్రసంగిం చనుంది. స్పెయన్‌లో జరిగే ఐఈఈఈ నానో-2024 సదస్సుకు సైతం ఆహ్వానం అందింది. కెనడాలో వరల్డ్ మాలిక్యులర్ సదస్సుకూ వెళ్లనుంది.
ఎంబీబీఎస్ 3వ సంవత్సరంలో ఉమాదేవి చూపిన ప్రతిభకు.. సావిత్రిబాయి పూలే అవార్డు అందుకుంది. ఇప్పటి వరకు పరిశోధనలతో ఇండియన్ గవర్నమెంట్ నుంచి 10 పేటెంట్ హక్కులు సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్యాన్సర్ రీసెర్చ్, మైక్రో స్కోపింగ్ ఇమేజింగ్ డివైజెస్, డ్రగ్ డెలివరీ డివైజ్ వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఇవి కాక భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి భారత్‌కు పేరు తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.
YUVA : మినియేచర్ క్రాఫ్ట్‌లో నైపుణ్యం- అందమైన వాహనాల నమూనాలకు జీవం పోస్తున్న సిద్దిపేట యువకుడు - miniature craft artist