May Day Celebrations in Telangana 2024 :రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా జెండాలను ఆవిష్కరించి, శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మికులందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని చెప్పారు.
CM Revanth wishes on May Day 2024 : రాష్ట్ర పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం వారి అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కార్మికుల శ్రమ వల్లే సమస్త సంపదలు :శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు మే డే అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమ వల్లే సమస్త సంపదలు సమకూరుతాయని అన్నారు. వారికి శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద హమాలీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. లక్షలాది మంది కార్మికుల త్యాగాలు ఈదేశ నిర్మాణంలో ఉన్నాయని మంత్రులు అన్నారు. కార్మికులు బీఆర్ఎస్‌ను వదిలించుకుని కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో కార్మికులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయని వివరించారు. ఈసందర్భంగా భారత్ రాష్ట్ర సమితి కార్మిక సంఘం నుంచి కొంత మంది ఐఎన్‌టీయుసీలో చేరారు. మంత్రులు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు.